మా తాత తాళం చెయ్ మొల్దారానికి కట్టుకుంటే
అమ్మమ్మ నష్యం సీస బొడ్లెసంచిల ఏసుకునేది
సాయమాన్ల కట్టెల పొయ్యి కాడి పీటనే
మా అమ్మమ్మకు సింహాసనం ఐతే
కట్ట మీంచి ఎడ్ల బండ్లె పొలం కానికి
యుద్ధానికి పోయే రాజు మా తాత
బర్లన్నీ తాత కోసం జూస్తే…
కోడి పిల్లలన్నీ అమ్మమ్మ కాళ్ళల్లనే తిరిగేటియి…
అమ్మమ్మకు దుఃఖమస్తే…
కంట్లె నీళ్లు ఎసట్ల కలుపుతది.
తాతకు కోపమస్తే…
జబ్బ మీది తువ్వాల న్యాలగ్గొడుతడు.
మా అమ్మమ్మ పొద్దుగాళ్ల
పంచపాల కోసం ఎన్కులాడితే…
తాతేమో ముల్లుగర్ర కోసం ఇళ్లంతా గాలిస్తడు..
అటుకు మీదున్న ఇత్తడి బిందెలే
అమ్మమ్మ ఆస్తి పాస్తులైతే…
గుమ్మిల వడ్లు మా తాత జేస్కచ్చిన కట్టం….
అమ్మమ్మ మాట ఆ ఇంటి పెంకుల
కిందనే పడుకుంటే…
తాత పెద్దరికం రచ్చబండ కాడ సవాల్ జేసేది
పాలోల్లు అమ్మమ్మని ఎడ్డిబాముల్దని ఎక్కిరిస్తే
తాతకు గర్రెక్కువని ఊరంతా పేరువోయిండు
తాత పెరట్లున్న చింతచెట్టుతో సోపతి జేస్తే
ఇంటెన్కున్న అరుగు బండే
అమ్మమ్మకు ఆసరయ్యేది
దూలానికి కట్టిన భాషింగాలు
దుమ్మువట్టిన
శీకిపోయి ఉన్న శారె పెట్టెల శీర
మూలకువడ్డ అడకత్తెర
దిగుట్లున్న కుంకుమ భరిణిని చూస్తే
అమ్మమ్మ నవ్వుమొఖం అగుపిస్తది
శిలుక్కొయ్యకున్న ఛత్రీని చూస్తే
తాత కండ్లల్ల మెదుల్తడు
ఆయన జెప్పిన మాటలు శెవుళల్ల
ఇప్పటికీ ఇనిపిస్తయ్…
బతుకంటే పైసలు ఎన్కకేసుడే గాదట
తిన్న నాలుగు మెత్కులు పెయ్యికి వట్టి
కంటి నిండా నిద్రపోవుడే..
రంది లేకుండా పద్దినాలు ఉండిపోవుడే..
– తుమ్మల కల్పన రెడ్డి,96404 62142