అందమైన అతివను సృష్టించాక
అంతే గౌరవాన్ని ఆమెకు ప్రసాదించమని
పట్టు పట్టాడు బ్రహ్మనేత కళాకారునితో
ఒక యజ్ఞం మొదలైంది
మొదటి త్యాగం పట్టుది అయితే
తనవంతుగా జీవితాన్ని ధారపోశాడు నేతన్న
కలప పందిరి కింద ఒక తపస్సు
కాళ్లు చేతులు ఒక లయతో నాట్యం
చెమట చుక్కలు నిరంతరం తాళం
రంగుల కనికట్టు జరుగుతుందని తెలిసి
దేవతలు ముచ్చట పడి వచ్చి చూసిరి
దారాలు పెనవేసుకుని దడి కట్టి
దేహానికి రక్షణ కంచె కడుతుంది
జరీ అంచు దిష్టి తీసి
మగవాడి చూపులన్నింటినీ
పాదాల దగ్గర మోకరిల్ల జేస్తాయి
పండుగ ప్రతీక పట్టు మాత్రమే
చీర కట్టుతో సంప్రదాయం కొనసాగే
భారత దేశం సంస్కృతి నిలయంగా విలసిల్లె
మగువ మురిపాలు సింగార అలంకారాలు
ముగ్ధ మనోహర కంచి బనారస్ ఇక్కత్ చీరెలు వరాలు
పోచంపల్లి గద్వాల్ వుప్పాడ వెంకటగిరి తెలుగు పట్టు క్షేత్రాలు
మగ్గం ఉన్న ప్రతి ఇళ్లు ఒక దేవాలయం
రాట్నం మంగళ హారతిలా నిత్య పూజా నిలయం
కడుపు నింపక పోయిన కళ కొనసాగించే గొప్ప సంకల్పం…
దాసరి మోహన్
99853 09080