బోనాల పండుగ ఏడాదికేడాది సరికొత్త సందడే
చినుకులు గుంపులు గుంపులుగా కూడంగ!
తలపై బోనం ఎత్తుకొని అమ్మ నడుస్తుంటే
వెనుకనే అక్కచెల్లెండ్లు గల్లీగల్లంతా జులూస్ ఇంటింటి నుంచి బోనం బృందగానం!
బోనాలు ఎత్తుకునుడంటే
మొగులు మెరుపు మబ్బులను ఎత్తుకొని
ఎదురుకున్నట్టు కిందకు దిగుడే
ఆషాడ మాసం వచ్చిందంటే
ఇంటింటి బోనాలతో
దివి దేవతలు దిగివచ్చినట్టే!
రంగమెక్కి చెప్పే అమ్మవారి
మనసులోని మాటలు
పొల్లు పోకుండా ఆకాశవాణి పలికినట్టే!
కింద జాతర జాతరగా మనముంటే
మీది మబ్బులు గుంపుగా రాకుండ ఉంటాయా!
బోనాన్ని గురుతు పట్టి
కిందికి ఉరుముకుంటూ
ఢల్లుఢల్లుగా ఆగకుండా కురుసుడే
భూమాత మురుసుడే!
ఇంటింటి బోనం మనందరి భాగ్యం
ఇంక బంగారు బోనం
తలమీద ఎత్తుకున్నాక
ఇగ తక్కువేమిది సరికిసరి వానలు!
సరికి సరి బంగారు పంటలు!
కందాళై
రాఘవాచార్య
8790593638