ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం
సమూహాల గోడలపై
నవ్వని బొమ్మవు నీవైనప్పుడు
నిన్ను నీవువెతుక్కో!
ఓ మహిళా నిన్ను నీవువెతుక్కో!!
అశ్రుధార పాల చెక్కిళ్ల నుంచి
ఎర్రని కంటి జీరల వరకు
నీవు సంధికాల వారధివి!
ఎత్తు నీ హృదయ కేతనం! ఎత్తు నీ భావ చేతనం!!
నిత్య శిక్షణల సామర్థ్యాలను ఉద్యోగ లక్షణాలకిచ్చి
నీవు పోలీస్ అధికారిణివైతివి
అత్తమామల అమ్మ నాన్నల ఆలనపాళ్లను
కొంచెం కొంచెం తీసి నీవు ఐపీఎస్వి అయితివి
కుటుంబ పాలన భాగాలన్నీ
అలవోకగా సంధించి నీవు ఐఏఎస్‌వీ అయితివి
కడుపు నింపినా కసవు ఊడ్చినా
కంటిపాపల కడు రమణీయతను పొదవి
బడి పిల్లలకు ఉపాధ్యాయినివి అయితివి
ఇంటి పరిశుభ్రతవు నీవే! శుభ్రౌన్నత్యానివీ నీవే!!
ఓ మహిళా నిన్ను నీవువెతుక్కో!!
ఎత్తు నీ హృదయ కేతనం! ఎత్తు నీ భావ చేతనం!!
ఓపికను చేతబట్టే సేవల సారథిగా
హాస్పిటల్స్ నర్స్ నీవే అయితివి
యాక్టర్‌గా డాక్టర్‌గా
పరిమితి లేని వైద్యానికి
నీవే ఓ శాస్త్ర చికిత్సవు.. నీవే ఓ శస్త్రచికిత్సవూ
సిరి ధమనుల ఒంటికి కవాటాల గుండెకూ
నల్లని బట్టను కట్టి
కళ్లు మూసిన న్యాయ దేవత ముందు
సత్యఖడ్గ ధారిణి లాయర్వూ నీవైతివి!
సమాజ పరిజ్ఞాన పరిణత రాజనీతిజ్ఞత నీదే
క్రీడల జాడలన్నీ క్రీనీడల జాడలన్నీ
మనసు పిడికిట పట్టేసినా
రోదసియానపు యాంత్రికత నీ జతనమైనా
ఐటీకి అటు ఇటూ నిలిచే
టెక్నాలజీ టెక్నిక్‌నూ ఫాలో అయితివి
వైజ్ఞానిక వ్యోమగామి చాతుర్యానివీ నీవే..
ఓ మహిళా!
అన్ని రోజులు నీవే అయినా…
అమ్మ నుంచి అమ్మమ్మ వరకు ప్రేమ సామ్రాజ్యాన్నేల
అంతరంగ క్షేత్రాన్ని అవలీలగా గెలిచే నీకు
అంతర్జాతీయంగా
ప్రత్యేక దినోత్సవాన్ని ప్రతిష్ఠించింది ఈ ప్రపంచం!
పెట్టని కీర్తి కిరీటంలో పెట్టిన
మరో కలికుతురాయి చేరిందే అనుకో!!
సమూహాలనెదిరించే సాధనమొక్కటి సాధ్యమైతే
ప్రతినిత్యం విజయకేతనం నీదే
జీవన సాంగత్యం నిత్య నూతనం
తొలిపొద్దు మలిపొద్దు కరిగే కాలం
నీ కంటి భాషకు చెందిన ధైర్యం
హృదయ కవాటాల ద్వీపంపై నీవు
అభినందనపూర్వక దీపమై వెలిగేవు
దుఃఖ నివారణ నీకు ఎడమచేతి వాటం
ఎత్తు నీ హృదయ కేతనం!
ఎత్తు నీ భావ చేతనం!!
డాక్టర్ కొండపల్లి
నీహారిణి