ప్రముఖ సినీ నటుడు కమల్‌హాసన్ ఇటీవల తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కన్నడిగులు తమ నిరసనలను తెలిపారు. అంతేకాదు, కమల్‌హాసన్ వెంటనే క్షమాపణ చెప్పాలనీ వారు డిమాండ్ చేశారు. కమల్‌హాసన్ మాత్రం తాను సోదరభావంతో చేసిన ప్రకటనను వక్రీకరించారని, దీనిపై క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని ప్రకటించారు. అయితే, ఈ గొడవ చిలికి చిలికి గానవానలా మారింది.
కమల్ నటించిన ‘థగ్‌లైఫ్’ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో కన్నడ నటుడు శివరాజ్‌కుమార్ సమక్షంలో కమల్‌హాసన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే, మొత్తం వ్యవహారం అనవసరంగా రాద్ధాంతమైంది. ఒకసారి ఈ వివాదంలోకి వెళ్లేముందు, మనం ద్రవిడ భాషల పుట్టుక, వాటి పరిణామం గురించి చర్చిస్తే ఈ వివాదాలకు తావే ఉండదు.
భారతీయ భాషలు ఇండో ఆర్యన్, ద్రావిడ అనే రెండు శాఖలుగా విభజించబడ్డాయి. ముఖ్యంగా మూల ద్రావిడం నుంచి తెలుగు, తమిళం, మలయాళం ఇంకా అనేక ఇతర గిరిజన భాషలు ఉద్భవించాయి. ఇందులో తమిళం పురాతన భాషగా వెలుగొందింది. అట్లాగే మూల ద్రవిడ వృక్షం నుంచి తెలుగు, కన్నడం, మలయాళం కొమ్మలుగా ఏర్పడ్డాయి. మూల ద్రావిడం నుంచి ఆవిర్భవించిన గిరిజన భాషలు ‘బ్రాహ్వీ’ లాంటివి పాకిస్థాన్‌లో ఉండటం, కురుక్, కోలామి లాంటి భాషలు మధ్య భారతంలో ఉండటం, గోండి, గదబ, ఇరుళ, తోడా లాంటి గిరిజన భాషలు దక్షిణ భారతంలో ఉండటం ద్రావిడ భాషల వ్యాప్తిని, విశిష్టతను తెలియజేస్తున్నాయి. ఈ భాషలు మూల ద్రావిడం నుంచి ఆవిర్భవించాయి కాబట్టి వీటికి సారూప్యత, భాషా నిర్మాణ పద్ధతిలో పోలికలుంటాయి. కాలక్రమంలో రాజ్యాలు, భౌగోళిక సరిహద్దుల మార్పులతో ఈ భాషలు మరింత మార్పునకు లోనై తమ ప్రత్యేకమైన అస్తిత్వాన్ని చాటుకున్నాయి.
తమిళంలో ‘సంగం’ సాహిత్యం (క్రీ.పూ.) 5-10వ శతాబ్దంలో ‘తిరుక్కురల్’, ‘శిలప్పదిగారం’, ‘మణిమేఖలై’ లాంటి ప్రసిద్ధ గ్రంథాలు ఆ తర్వాత నయనార్లు (శివుని ఆరాధకులు), ఆల్వార్లు (విష్ణు ఆరాధకులు) తమ భక్తి రచనలతో ఈ భాషను సుసంపన్నం చేశారు. అయితే, ప్రస్తుత చర్చలో భాగంగా కన్నడ భాష విషయానికి వస్తే.. ద్రావిడ భాషలలో దీని విలక్షణతను నిలుపుకొని కస్తూరి కన్నడగా ప్రసిద్ధి చెందింది.
‘కవిరాజ మార్గం’ అనే గొప్ప గ్రంథం వెలయగా, 10వ శతాబ్దంలో పంప, రణా, పొన్న కవిత్రయం కన్నడకు మరింత కావ్య గౌరవం కల్పించారు. పద్య, గద్యాలతో కూడిన ‘చంపూ’ ప్రక్రియను కన్నడ భాష ప్రాచుర్యంలోకి తెచ్చింది. అద్భుతమైన ‘యక్షగాన’ సంప్రదాయానికి నాందిపలికి, ఇప్పటికి సజీవంగా నిలుపుకున్నది. కన్నడ భాషను జైనులు విపరీతంగా ఆదరించారు. జైన మత చరిత్ర మొత్తం కన్నడ గ్రంథాల్లో నిక్షిప్తమై ఉన్నది. తెలుగు వారు విపరీతంగా ఆదరించే ‘రాయల’ వారి రాజభాష ‘కన్నడ’నే. అయినా తెలుగును ప్రోత్సహించడం అతడి రాజనీతిజ్ఞతకు నిదర్శనం. యూఆర్ అనంతమూర్తి, భైరప్ప లాంటివారి రచనలు ఆధునిక కాలంలో ఈ భాషను సుసంపన్నం చేశాయి. అత్యధిక జ్ఞాన్‌పీఠ్ అవార్డులు గెలుచుకున్న ప్రాంతీయ భాష ఇది. ‘గుబ్బి వీరన్న’ కన్నడ నాటక కళాబృందం, కన్నడ భాషను జన బాహుళ్యంలోకి తెచ్చింది. గిరీశ్ కర్నాడ్ ‘యయాతి’, ‘తుగ్లక్’ భారతీయ సాహిత్యానికి తునకలు. కన్నడ లిపి తెలుగును పోలి ఉంటే, భాష నిర్మాణపరంగా తమిళానికి చేరువగా ఉంటుంది.
‘కువెంపు’, ‘సర్వజ్ఞ’ లాంటివారు మధ్యయుగంలో ఈ భాషా సాహిత్యాన్ని మరింత అందంగా తీర్చిదిద్దారు. ఇటీవలి కాలంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ రామాయణ కావ్యాన్ని రచించారు. విశ్వకవి రవీంద్రుడు అభిమానించే భాషగా కన్నడ ప్రసిద్ధి పొందింది. గాంధేయవాది అయిన వినోబా భావే కన్నడ లిపిని ‘విశ్వ లిపి’ అని కొనియాడారు. వచన కన్నడ ఉద్యమాన్ని సంఘ సంస్కర్తలైన బసవన్న, అక్కమహాదేవి బలంగా ఉపయోగించుకున్నారు. వీరశైవం భాషా సంస్కరణ పోటీ పడగా, పురంధర దాసు వైష్ణవ సంప్రదాయాన్ని కన్నడ కీర్తనలలో ప్రవేశపెడితే కర్ణాటక సంగీతం కొత్తపుంతలు తొక్కింది. ఇది ‘హరిదాస’ సంప్రదాయానికి నాంది పలికింది. బహుశా ఇటువంటి ఘన చరిత్ర కలిగి ఉన్న కన్నడను తక్కువ చేసి ‘కమల్’ తమిళ పెద్దన్నగా వ్యవహరిస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు.
అయితే, ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. భారతీయ సినీ రంగంలో కమల్‌హాసన్, ప్రకాశ్‌రాజ్‌లు విశిష్ట వ్యక్తిత్వం కలవారు. వీరిద్దరూ సాహితీ ప్రియులు, 4, 5 భాషలలో నిష్ణాతులు. చరిత్ర, భాషపై అవగాహన కలిగి ఉన్నవారు. ఇటువంటి వారికి ఇతర భాషలను తక్కువచేసి మాట్లాడే ఉద్దేశ్యం ఉండకపోవచ్చు.
ప్రసంగ ధోరణిలో కమల్‌హాసన్ నోట ‘తప్పు’ దొర్లి ఉండవచ్చు. అయితే మారుతున్న రాజకీయ నేపథ్యంలో ప్రతీది వివాదాస్పదమవుతున్నది. ఈ నేపథ్యంలో కమల్ వ్యాఖ్యల అంతరార్థం కన్నడిగులకు సరైనరీతిలో చేరకపోవడం వల్ల వారు బాధపడి ఉండవచ్చు. అయితే కమల్ కన్నడ మాట్లాడగలడు. అతడు అనేక కన్నడ చిత్రాలలో నటించాడు. కన్నడిగులు ఎంతో ఆరాధించే రాజ్‌కుమార్ కుటుంబానికి ఆప్తుడు. ఒకవేళ భాషాధిపత్యపు ధోరణి ప్రదర్శిస్తే దానిని వ్యతిరేకించాలని తప్ప అతన్ని బహిష్కరించటం తగదు. ఇక్కడ కమల్‌హాసన్ కూడా పంతాలకు పోకుండా, కన్నడ సోదరులకు తన మాటల అర్థం వివరించి చెప్పాలి. ముఖ్యంగా కమల్‌హాసన్ తన విశిష్టమైన వ్యక్తిత్వాన్ని తన సోదర భాషయైన కన్నడ పట్ల అభిమానాన్ని ప్రకటించాలి.
ద్రావిడ భాషల పుట్టుపుర్వోత్తరాల గురించి భద్రిరాజు కృష్ణమూర్తి విస్తృత పరిశోధనలు జరిపారు. ‘బిషప్ కాల్డ్వెల్’ కూడా ఈ పరిణామక్రమంపై విశేష కృషిచేశారు. వీరిరువురు కాకుండా అనేకమంది భాషా శాస్త్రవేత్తల అభిప్రాయాల ప్రకారం కూడా ఇతర ద్రావిడ భాషలు తమిళ భాష నుంచి పుట్టాయన్నది వాస్తవం కాదు. ప్రస్తుతం ‘తల్లి’ భాష అంటూ ఏదీ లేదు. గతంలో అన్ని భాషలకు ‘సంస్కృతం’ మూలమని వాదించారు. కానీ, భాషా శాస్త్రవేత్తలు తిప్పికొట్టారు. తెలుగును కూడా సంస్కృత జన్యమని వాదించారు. ఈ గాలి వాదనలు నిజం కావని కావాల్సినన్ని పరిశోధనలు రుజువు చేశాయి. ముఖ్యంగా భాషపై వ్యాఖ్యానించటం అందరూ మానుకొని ఆ విషయాన్ని భాషా శాస్త్రవేత్తలకు వదిలివేయాలి. ముఖ్యంగా బహుళ భాషలకు పుట్టినిల్లు అయిన భారతదేశంలో ఈ బహుళత్వాన్ని చూసి గర్వించాలి కానీ, తగవుపడొద్దు. ఇది మరింత వైషమ్యాలకు దారితీస్తుంది. బంగ్లాదేశ్ ఆవిర్భావపు కారణం భాషనే. అలాగే తమిళం పట్ల సింహళ వాళ్లు చూపిన వివక్ష ఒక అంతర్యుద్ధానికి దారితీసింది. అన్ని భాషలను గౌరవిద్దాం. అందరం కలిసి ఉందాం. గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకోవద్దు.
ఒక టీవీ షోలో కమల్‌హాసన్ శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానాన్ని ఉదహరిస్తూ తెలుగు భాష శబ్ద సౌందర్యాన్ని వర్ణిస్తూ ‘వస్తున్నాయి, వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు’ అని ఉద్వేగభరితంగా పాడి తెలుగు వారి మనసులను కొల్లగొట్టాడు. అంతకుముందు చలనచిత్రాలలో మనకు దగ్గరయితే, ఈ కవిత్వ పఠనంతో మరింత దగ్గరయ్యాడు. అదేవిధంగా కన్నడిగులకు అక్కమహాదేవిపై పాడిన హారతి గీతం ‘హారతియె బెళగిరీ అక్కమహాదేవి’ అంటూ కన్నడంలో ఆలపించి కన్నడిగులకు సాంత్వన కలిగించాలి. అప్పుడే నిజమైన ద్రావిడ సోదరభావం నిలుస్తుంది.
– చంద్రశేఖర్ 75060 13691