నిర్వహణా ? విస్తరణా?
మొదటిసారిగా వచన కవితను భాగాలుగా విభజించి వాటిని పేర్కొన్న వారెవరు? భద్రిరాజు కృష్ణమూర్తి, జీవీసుబ్రహ్మణ్యం, చేకూరి రామారావు లాంటివారు చెప్పి ఉన్నట్టు ఎక్కడా చదవలేదు. మన ప్రాచీన ఆలంకారికులు చెప్పి ఉంటారనుకునే అవకాశమే లేదు.
వివాదాస్పదంగా ఉన్నా సరే, కొత్త విషయాలను చెప్పాలి సాహిత్య వ్యాసాల్లో. నూతన ప్రతిపాదనలు చేయాలి, కొత్త ప్రశ్నలను లేవనెత్తాలి. అప్పుడే చర్చకు ఆస్కారముంటుంది. తద్వారా కొంతైనా ప్రయోజనం చేకూరుతుంది. చర్చ చేసేవాళ్లు ఈ రోజుల్లో బహు అరుదు అనుకుంటే, ఒకే చోట అందరూ కలిసి చర్చించక పోయినా, చదివినవారు ప్రతిపాదిత విషయం గురించి కనీసం తమలో తాము అయినా ఆలోచించే అవకాశం ఉంటుంది కదా. అందుకే ఒక చిన్న విషయం గురించి ఈ చిన్న వ్యాసం.
మొదటిసారిగా వచన కవితను భాగాలుగా విభజించి వాటిని పేర్కొన్న వారెవరు? భద్రిరాజు కృష్ణమూర్తి, జీవీసుబ్రహ్మణ్యం, చేకూరి రామారావు లాంటివారు చెప్పి ఉన్నట్టు ఎక్కడా చదవలేదు. మన ప్రాచీన ఆలంకారికులు చెప్పి ఉంటారనుకునే అవకాశమే లేదు. ఎందుకంటే వారి కాలంలో కావ్యాలు, ఆశ్వాసాలు ఉన్నాయి తప్ప ఈనాడు మనం చెప్పుకుంటున్న (వచన) కవిత అనేది లేనే లేదు. కాబట్టి, ఆ పని గత మూడు శతాబ్దాలలోనే జరిగి ఉండాలి. కానీ దాన్ని ఎవరు ఎప్పుడు చేశారో ఇదమిత్థంగా చెప్పలేకపోతున్నాం. అయితే వచన కవితలో శీర్షిక, ఎత్తుగడ, నిర్వహణ, ముగింపు అనే నాలుగు భాగాలుంటాయని ఇప్పుడు చదువుతున్నాం మనం. వీటిలో మూడవదానికి నిర్వహణ అనే పేరు సరిగ్గా ఉందా అనే అనుమానం వస్తుంది కొందరికైనా. రావాలి కూడా.
నిర్వహణ ఆంగ్లంలోని ఆర్గనైజ్( organize), కండక్ట్ (conduct) అనే మాటలకు సమానార్థకం. Oversee, supervise, manage లు ‘నిర్వహణ’కు అంత దగ్గరగా రావు. నిర్వహించడం organize చేయడానికి లేదా conduct చేయడానికి సమానం అయినప్పుడు కవులు కేవలం ఎత్తుగడ, ముగింపుల మధ్య ఉన్నదాన్ని మాత్రమే నిర్వహిస్తారా? శీర్షికను, ఎత్తుగడను, ముగింపును నిర్వహించరా? నిర్వహణ అనే మాటను పూర్తిగా నిరాకరించడం కాదు గాని, దాన్ని improvise చేస్తూ (మెరుగు పరుస్తూ) మరింత మంచి మాటను కనుగొనలేమా? ఇట్లా ఆలోచించినప్పుడు, నిర్వహణకన్న విస్తరణ ఎక్కువగా పొసగే మాట అనిపిస్తుంది. ప్రధానభాగం (main body) కూడా సరిపోయే మాటే.
నిజానికి కవితలోని మూడవ భాగాన్ని విమర్శకులు, కవులు నిర్వహణ అనే పేరుతో వ్యవహరిస్తున్న సంగతి ఈ వ్యాసకర్తకు మొదట్లో తెలియక, మొన్నమొన్నటి దాకా విస్తరణ అన్న పదాన్నే వాడుతూ వచ్చాడు! ఎత్తుగడ, ముగింపుల మధ్య ఉండే భాగం కవితలో విస్తరణ (expansion) ను సాధించేందుకు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. మిగతా మూడు భాగాల నిడివి చాలా తక్కువ కనుక, వాటి ద్వారా కవితలో విస్తరణ సాధ్యం కాదు. అయితే ఈ మాట కూడా పూర్తి సంతృప్తికరంగా ఉన్నదో లేదో విమర్శకులు, కవులు ఆలోచించాలి. విస్తరణ అనేది సరిపోయినంత బరువున్న మాట కాదనీ, కాబట్టి అది అంత సమంజసంగా లేదనీ అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు ఒక విమర్శక కవి. ఇదీ నిజమే కావచ్చు. అయితే మరి సరైన పదమేది? తేలాలి.
-ఎలనాగ
98669 45424
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

