ఒకరి చేనుకు ఒకరు బదులుపోయి
నాట్లు వేయడం కలుపు తీయడం చేస్తున్నట్లే
ఓ మంద అయ్యాక ఇంకో మంద
నీళ్లేసి సపారంలోనో చెట్లనీడలోనో గొర్లు కత్తిరిస్తుండ్రి
అరుగుల మీద బంకులల్ల
చింతబోటు వలిచి ఎండబెట్టినట్లుగా
నల్ల ఉన్ని కసుర ఉన్ని తెల్ల ఉన్ని
ఒకదానికొకటి వేరుచేసి ఎండబెట్టేది
వడికిన ఉన్ని కండెలను ప్యాక కట్టెలకు చుట్టి మగ్గానికి పంపేది
పొద్దున్నే దూడలకు పాలు సేపిన
ఆవు గేదెల వలే మందకాడ పిల్లలకు పాలుసేపి
గొర్లొళ్లకు కాసిన్ని పాలిచ్చేవి ఉన్ని గొర్లు
ఏడాదికి ఉత్తరాయణం దక్షిణాయణం అన్నట్లుగా
మొక్కార్తిలో ఓసారి శివరాత్రి ముందోసారి
ఊరంతా గొర్ల కత్తిరింపులు
సాయంత్రానికి నోరూరించే గుగ్గిళ్ల రుచులు
చింతబిచ్చల సరంబలితో పడుగు పూత పూసి
కుంచె దబ్బలతో సవాలలు అల్లితే
గిజిగాడు గూడు అల్లడానికి గురువులు గొర్లొళ్లు అయినట్లుండేది
కులవృత్తులు కనుమరుగవుతున్నట్లే
కులాలకు ఆనవాళ్లయిన పదాలు కనుమరుగవుతున్నాయి
వ్యాపారులు బాయిలర్ కోళ్లను పెంచుతున్నట్లు
గొర్లొళ్లు బండగొర్లను పెంచుతున్నారు
అంతరించిపోతున్న జీవరాసుల్లో
ఉన్ని గొర్లు చేరిపోయాయి
గొంగడ్లకు సర్వనామాలై స్వెట్టర్లు వచ్చాయి
ఉపాధి కల్పించే ఉన్ని గొర్లకు
పర్యాయపదాలై బండగొర్లొచ్చాయి!
-ఎజ్జు మల్లయ్య
91006 10501