కుండ నిండా బువ్వ పొంగుతుంటే
గంజి వాసనకే కడుపు నిండినట్లనిపిస్తది
ముక్కు పుటాలు ఉబ్బుతై
గల్లీ అంతటికీ పూల పూల అన్నం వాసన
ఆకలిని యాది చేస్తది
కుండల ఉడికే బువ్వ నాల్కను
రుచితో ఓలలాడిస్తది
మోతుకాకు ఇస్తర్ల బువ్వేసుకొని
చింతకాయ తొక్కు కలుపుకొని
గుట్ట గుట్ట బుక్కలు మింగుతుంటే
ఇంతకన్నా రాజ భోజనం ఏముంటుంది !
మహా రాజులకు ఈ రుచి ఎలా తెలుస్తది
దురదృష్టవంతులు!
పొద్దంతా కాయకష్టం చేసే
అవ్వ అయ్య అక్క చెల్లె అన్న తమ్ముడు
తాతలు నానమ్మలు అమ్మమ్మలు
అందరూ గుండ్రంగా కూసోని
ముచ్చట్లాడుకుంటూ నవ్వుకుంటూ
కొసరి కొసరి వడ్డించుకోని తింటుంటే
చూడంగ చూడంగనే
బువ్వల కుండ ఒడిసిపోతది
చూద్దామన్నా ఒక్క మెతుకు మిగలదు
ఇంకా తినాలనిపిస్తది
కుండల బువ్వ అంతే
ఎంత తిన్నా ఇంకా తినాలనిపించే దావతే
-కందాళై రాఘవాచార్య , 87905 93638