2016 నాటి పెద్ద నోట్ల రద్దు తరహాలోనే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఈ20’ ఇథనాల్ పెట్రోల్ విధానం దేశ ప్రజల మీద బలవంతంగా రుద్దుతున్న మరో ప్రయోగమనే విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. పర్యావరణ రక్షణ, రైతుల అభ్యున్నతి, ఇంధన ధరల తగ్గింపు అని ప్రభుత్వం చెప్తున్న కారణాలు ఆచరణలో పచ్చి అబద్ధాలని ఆధారాలతో రుజువవుతున్నాయి. ఈ విధానం వల్ల సామాన్యుల జేబులకు వేలాది రూపాయల చిల్లు పడుతుంటే, బడా కార్పొరేట్లు, చక్కెర మిల్లుల యజమానులు మాత్రం లాభాలు గడిస్తున్నారు.
అసలు ‘ఈ20’ అంటే 80 శాతం పెట్రోల్‌కు 20 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనం. చెరుకు, మక్కజొన్న, బియ్యం తదితర వ్యవసాయ ఆధారిత ముడిపదార్థాల నుంచి ఇథనాల్‌ను ఉత్పత్తి చేస్తారు. ప్రభుత్వం ఈ విధానానికి ప్రధానంగా మూడు ప్రయోజనాలను చూపుతున్నది. మొదటిది-ముడిచమురు దిగుమతులపై ఆధారపడడం, ఇంధన కాలుష్య ఉద్గారాలను తగ్గించడం. రెండవది-విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడం. మూడవది-రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు మార్కెట్ కల్పించడం. అయితే వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఆటోమొబైల్ తయారీదారుల సంఘం ‘సియామ్’ ఈ నెల 4న ప్రభుత్వానికి రాసిన ఒక లేఖ లీక్ కావడంతో ‘ఈ20’ అసలు బండారం బయటపడింది. అయితే ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో అనంతరం లేఖాంశాన్ని మార్చింది. ‘ఈ20’ ఇంధనం వాడకం వల్ల మారుతి, హ్యుందాయ్, టాటా వంటి కంపెనీల కార్లలో ఫ్యూయల్ ఇంజెక్టర్లు, ఫ్యూయల్ పంపులు, ఈఆర్జీ వాల్వులు తీవ్రంగా తుప్పుపడుతున్నాయని ఈ నివేదిక వెల్లడించింది.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నిబంధనల ప్రకారం ఇంధనంలో క్లోరైడ్ కంటెంట్ 1mg/kg కన్నా తక్కువ ఉండాలి. కానీ, ‘ఈ20’ పెట్రోల్ బంకుల్లో 350 mg/kg, వాహనాల ట్యాంకుల్లో 500 mg/kg వరకు (అనుమతించిన దానికంటే వందల రెట్లు ఎక్కువ) క్లోరైడ్ ఉన్నట్లు ల్యాబ్ టెస్టింగుల్లో తేలింది. దీనికి తోడు ఇథనాల్‌కు గాలిలోని తేమను పీల్చుకునే గుణం ఉండటం వల్ల ఇంధన నాణ్యత దెబ్బతిని, ‘ఫేజ్ సెపరేషన్’ జరిగి వాహనాలు నడిరోడ్డుపై మొరాయిస్తున్నాయి. ‘ఈ20’ వాడకంతో వాహనాల ఇంధన సామర్థ్యం భారీగా పడిపోతున్నది. ఒక లీటర్ స్వచ్ఛమైన పెట్రోల్ దహనమైతే సుమారు 32 మెగాజౌల్స్ శక్తి వస్తే, ఇథనాల్ ద్వారా కేవలం 21.1 మెగాజౌల్స్ శక్తి మాత్రమే వస్తున్నది. అంటే పెట్రోల్ కంటే ఇథనాల్‌కు 33 శాతం తక్కువ సామర్థ్యం ఉంటుంది. దీనివల్ల మొత్తం ఇంధన శక్తి సుమారు 8 శాతం మేర తగ్గిపోతుంది. ఫలితంగా, పట్టణాల్లో తిరిగే కార్లలో ఏకంగా 15 శాతం నుంచి 20 శాతం వరకు మైలేజీ తగ్గిపోతున్నదని సర్వేలు చెప్తుండగా, కనీసం 2 నుంచి 6 శాతం మైలేజీ తగ్గుతుందని ప్రభుత్వం స్వయంగా పార్లమెంటులో అంగీకరించింది. మైలేజీ తగ్గడం వల్ల 2023 ఏప్రిల్ నుంచి 2026 మార్చి మధ్యకాలంలో దేశ ప్రజలు ఏకంగా 6.57 మిలియన్ మెట్రిక్ టన్నుల అదనపు ఇంధనాన్ని వాడాల్సి వచ్చింది. ఈ అదనపు ఇంధనం కోసం వాహనదారులు తమ జేబుల నుంచి ఏకంగా రూ.88,234 కోట్లు ఖర్చు చేయాల్సి రావడం క్షమించరాని విషయం.
రైతుల ఆదాయం పెంచడానికే ఈ విధానం తెచ్చామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, వాస్తవానికి ఇథనాల్ తయారుచేసే కంపెనీలు, డిస్టిల్లరీలకు మాత్రమే భారీ లాభాలు చేరుతున్నాయి. ఇథనాల్ తయారీకి వాడే మక్కజొన్నను పండించే రైతులకు కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదు. 2025 నవంబర్ నాటికి ఎంఎస్పీ రూ.2,400కి పెరిగినా, మార్కెట్లో ధర మాత్రం రూ.1,600కే పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
2026 ఆగస్టులో కూడా ఎంఎస్పీ కన్నా రూ.391 తక్కువకే మక్కజొన్న అమ్ముడవుతున్నది. పైగా, ఇథనాల్ కంపెనీలకు చౌకగా ముడిసరుకు అందించడం కోసం, ప్రభుత్వమే కిలో రూ.24.41 చొప్పున రైతుల వద్ద కొన్న బియ్యాన్ని ఎఫ్‌సీఐ ద్వారా కేవలం రూ.23.20కే వారికి విక్రయిస్తూ కిలోకు రూ.1.20 మేర నష్టాన్ని భరిస్తున్నది. ఇథనాల్ మిశ్రమంతో పెట్రోల్ అత్యంత చౌకగా లభిస్తుందని, ఉద్గారాలు తగ్గి వాహనాలు వేగంగా పరుగులు పెడతాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఊదరగొట్టారు. కానీ ఇది తప్పని తేలింది. ప్రజలు సామాజిక మాధ్యమాల్లో గగ్గోలు పెడితే ఆ ప్రచారాన్ని ఆపడానికి గడ్కరీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎఫ్-1 రేసింగ్ కార్లలో పూర్తిగా ఇథనాల్ వాడుతుంటారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఉదహరించారు. కానీ ఆ ఎఫ్-1 కార్ల ఇంజిన్లు కేవలం ఇథనాల్ కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేస్తారని, కేవలం కొన్ని రేసుల తర్వాత ఆ కార్లను తుక్కుగా మార్చేస్తారని, దీనిని సాధారణ కార్లతో పోల్చలేమని ఆయన పేర్కొనలేదు. పెట్రోల్‌లో ఇథనాల్ కలుపడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని ప్రభుత్వం చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలని తేలిపోయింది. ఇథనాల్ డిస్టిల్లరీల ప్రక్రియ కోసం ఏకంగా లక్షలాది లీటర్ల అమూల్యమైన భూగర్భ జలాలను నాశనం చేస్తున్నారు. అదీగాక, వాహనాల మైలేజీ పడిపోవడం వల్ల కేవలం మూడేండ్లలో ఏకంగా 6.57 మిలియన్ మెట్రిక్ టన్నుల అదనపు ఇంధనం మండటం పర్యావరణంపై తీవ్రమైన కాలుష్య భారాన్ని మోపుతున్నది. కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల పక్షాన నిలబడి, పాత వాహనదారులకు స్వచ్ఛమైన పెట్రోల్ పొందే హక్కును కల్పిస్తూ, ఇంధన నాణ్యతపై కఠిన పర్యవేక్షణ చేపట్టాలి.