కడప లోపటే కదిలే ప్రపంచం
ఇంటి వైశాల్యంలోనే విహారం
మనసైతే గాలిలోనే తిరిగొస్తది
మాటాముచ్చటా ఫోనే చేపిస్తది
మనిషి మాత్రం కదలని మెదలని గుట్ట
కాలుకు ఆయి అయితేనేమి!
ఆహార జీవప్రక్రియకు నో విరామం
రొటీన్ నుంచి మరింత బలవర్ధకం
ప్రేమ మరింత చిగురులు వేసి
చాలు చాలునన్నా కావలసినవన్నీ
బల్మీటికి డైనింగ్ టేబుల్‌ను ఆవరిస్తాయి
పాదం కోలుకునేలోపు
నెమ్మదిగా ఎల్బో స్టిక్‌తో అడుగులు
మనసు ఆగమైనా ఆగని కృత్యాలు
కుర్చీలో కూర్చునే చల్లని స్నానం
మగ్గు మగ్గు పోసుకున్నకొద్దీ అల్కగ
స్టూల్ మీంచే దంతధావనం
సింక్‌లోనే చిన్నగ ముఖప్రక్షాళనం
మితిమీరుతున్నదా ఈ గావురం
ఇస్త్రీ వస్ర్తాలకు సెలవులే
లుంగీ అంగీలు ఆ అరలోనే ఓరకు
దినాం షార్ట్స్‌తోనే గడిచే కాలం
పలకరింపు పలుకుల లేపనాలకు
సగం గాయం మటుమాయం
ఎముక వికలమైతే ఇల్లే ప్రపంచం
ఎక్కువ సమయం హాలపురం
అప్పుడప్పుడూ కిచెన్ పుర
మధ్యమధ్యలో వాషింగ్టన్
రాత్రి కాగానే బెడ్రూమ్ హిల్స్
నాలుగు వారాలదాకా
నాకు గృహమే కదా మహానగరం
– అన్నవరం దేవేందర్ 9440763479