విభజించి చూస్తున్నట్టు
రక్తాన్ని కూడా విభజించాలి
డబ్బులున్నోడిది ఏ రక్తమో
డబ్బు లేనోడిది ఏరక్తమో రంగులను గుర్తించాలి
కులాన్ని బట్టి వేరుశనగ పండుతుందనుకుంటే
భూమిలో మొలకెత్తినప్పుడే కులం పేరు రాసుండాలి
దావఖానలో పుట్టినోడికి దేవుడి ఆశీస్సులు అనుకుంటే
కాన్పు చేస్తున్న వైద్యులే దేవుళ్లు అనుకోవాలి
కన్యాదానానికి ఆస్తిపాస్తులు చూస్తుంటే
కాటికి వెంట తీసుకెళ్తున్న సంపదలెన్నో చూపాలి
ధనవంతుడు ధనవంతుడి చుట్టే తిరుగుతుంటే
హింసకు గురైన బాధితుల లెక్కలు చెప్పాలి
పెళ్లికి అణగారిన కులమైనప్పుడు
అత్యాచారానికి బలైపోతున్న కులమేదో గుర్తించాలి
చంద్రునిపై పరిశోధనలు జరుపుతున్నట్టు
మానవీయతపై పరిశోధనలు జరగాలి
ఆకారమొక్కటే కాదు అవయవాలు కూడా లెక్కించాలి
కులాన్ని బట్టి ఏయే అవయవాలేవో గుర్తించాలి
చేతులెత్తి మొక్కడానికి వచ్చిన చోట కులాన్ని సూచించన
విష్ణు ఈశ్వర బ్రహ్మల రహస్యం ఏమిటో తెలియాలి
– ఎజ్జు మల్లయ్య
96528 71915