మా కుటుంబంలో నేనే చిన్నదాన్ని. అలా అని చిన్నపిల్లనేం కాదు. పాతికేండ్లు వచ్చాయి. కానీ నా అభిప్రాయానికి విలువ ఇవ్వరు. నా ఆలోచనలను అర్థం చేసుకోరు. ఆఫీసులో ఓ సహోద్యోగి నాతో స్నేహంగా ఉంటాడు. నా భావాలను మెచ్చుకుంటాడు. అతణ్ని పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. కానీ కుటుంబంలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. అతణ్ని మర్చిపోమంటూ హెచ్చరిస్తున్నారు. నన్నేం చేయమంటారు?
నలుగురు పిల్లలున్న కుటుంబంలో చిట్టిచివరి కొడుకు లేదా కూతురు ఎదుర్కొనే ఇబ్బందే ఇది. చిట్టితల్లి, చినబాబు, బుజ్జాయి అంటూ గారాబం చేస్తూనే ఉంటారు. ఆ ప్రేమను తప్పుపట్టలేం. కానీ, తనూ ఓ ఎదిగిన బిడ్డే అని గ్రహించాలి. అదే లోపిస్తున్నది. ముందుగా మీరు అతని గురించి లోతుగా ఆలోచించండి. జీవిత భాగస్వామిగా తగిన వ్యక్తేనా అన్నది బేరీజు వేసుకోండి. అది సరైన నిర్ణయమే అనిపిస్తే.. కుటుంబ సభ్యులతో మాట్లాడండి. మీ ఎంపిక ఎందుకు సరైందో చెప్పండి. శతవిధాలా ప్రయత్నించి ఒప్పించండి. మీ వాళ్లు మిమ్మల్ని అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉంది.