వాతావరణం చల్లబడినప్పుడు జలుబుతోపాటు తలనొప్పి కూడా వేధిస్తుంది. ఈ సమస్యకు ‘హైడ్రో థెరపీ’ అద్భుతమైన పరిష్కారం చూపుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అందులోనూ ఫుట్ సోక్స్ (పాదాలను నానబెట్టడం) ద్వారా తలనొప్పి, మైగ్రేన్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని అంటున్నారు. దీనికి గల శాస్త్రీయ కారణాలను వివరించారు. పాదాలను వేడి నీటిలో ముంచినప్పుడు, ఆ వేడికి ప్రతిస్పందనగా కాళ్లు, పాదాలలోని రక్తనాళాలు విస్తరిస్తాయి. ఫలితంగా, తలలో స్థిరపడిపోయిన రక్తపోటు, వ్యాస్కులర్ రద్దీ తగ్గుతుంది. ఇది టెన్షన్, చలి, సైనస్ సమస్యల వల్ల వచ్చే తలనొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
అంతేకాకుండా, వేడి నీరు పారాసింపథటిక్ నాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. తద్వార శారీరక విశ్రాంతిని ప్రోత్సహిస్తుంది. ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి కూడా దూరమవుతుంది. ఇలా ఆరు వారాల పాటు క్రమం తప్పకుండా వేడి నీటిలో పాదాలు, చేతులను నానబెట్టడం వల్ల నాడీ వ్యవస్థ నియంత్రణలో ఉంటుందని గతంలో నిర్వహించిన ఒక అధ్యయనం కూడా తేల్చింది. అంతేకాకుండా, వారిలో మైగ్రేన్ తగ్గడం, వచ్చినా తీవ్రత తక్కువగా ఉండటం లాంటి లక్షణాలనూ గుర్తించారు. ఈ హైడ్రో థెరపీ వల్ల మైగ్రేన్‌తోపాటు కీళ్ల సమస్యలు, హైపర్ టెన్షన్ కూడా అదుపులో ఉంటాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇక వేడి నీటిలో ఉప్పు, లెమన్‌గ్రాస్ లాంటివి కలిపితే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని అంటున్నారు.
ఇలా చేయాలి..
ఒక బకెట్లో వెచ్చని (38-40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండే) నీళ్లు నింపాలి. అందులో ఒక గుప్పెడు ఉప్పు వేసి బాగా కలపాలి. సౌకర్యవంతమైన కుర్చీలో కూర్చుని, పాదాలను ఆ నీటిలో ముంచి, 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.