సామాజిక మాధ్యమాల్లో ఈమధ్య కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆరేడేళ్ల పిల్లలే.. జిమ్‌లో భారీ బరువులు ఎత్తుతూ, కండలు తిరిగిన బాడీ బిల్డర్లలా పోజులిస్తున్నారు. వాటిని చూసి.. కొందరు ‘వావ్’ అంటున్నారు, మరికొందరు ‘అయ్యో పాపం!’ అంటూ నిట్టూరుస్తున్నారు. ఈ క్రమంలో.. ‘మా పిల్లలూ అలాగే ఉండాలి’ అని కోరుకునే; ‘మా బాబుకు ఏడేళ్లు. జిమ్‌కి పంపించవచ్చా?’ అని అడిగే పేరెంట్స్ పెరుగుతున్నారు! అదే సమయంలో వారిలో అనేక అనుమానాలు. ఏడేళ్ల పిల్లవాడు జిమ్‌కి వెళ్లడం సురక్షితమేనా? అది వారి ఎదుగుదలను ఆపేస్తుందా? లేక ఆరోగ్యాన్ని ఇస్తుందా?.. ఇలా తల్లిదండ్రులు తేల్చుకోలేని ఈ సందిగ్ధతపై నిపుణులు ఏమంటున్నారో చూద్దాం!
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. 5 నుంచి 17 ఏళ్ల వయసున్న పిల్లలు రోజుకు కనీసం 60 నిమిషాలు శారీరక శ్రమ చేయాలి. అయితే, ఆరేడేళ్ల పిల్లలకు జిమ్‌లోని ట్రెడ్మిల్స్ కంటే, బయట మైదానంలో ఆడే ఆటలే మిన్న అనేది నిపుణుల అభిప్రాయం. పరిగెత్తడం, దూకడం, సైక్లింగ్ చేయడం వల్ల వారి ఎముకలు, కండరాలు సహజంగా దృఢపడతాయి. అందుకే పెద్దవారికి సూటైన వర్కౌట్స్.. పిల్లలకు హానికరం కావచ్చు! హెవీ వెయిట్ లిఫ్టింగ్, ఇంటెన్స్ కార్డియో, రిపిటేటివ్ మూవ్మెంట్స్.. ఇవన్నీ పిల్లల్లో ఎముకలు పెరిగే భాగాలపై ఒత్తిడి పెంచవచ్చు. కొన్ని సందర్భాల్లో గాయాలయ్యే ప్రమాదం కూడా ఉండవచ్చు.
ఎదుగుదల ఆగుతుందా?
చిన్నప్పుడే బరువులు ఎత్తితే పిల్లల ఎదుగుదల, ముఖ్యంగా ఎత్తు పెరగడం ఆగిపోతుందనేది చాలామంది తల్లిదండ్రుల్లో ఉండే భయం. కానీ, సైన్స్ ఏం చెబుతున్నదంటే…
నిజం: సరైన పద్ధతిలో, నిపుణుల పర్యవేక్షణలో చేసే వెయిట్ ట్రైనింగ్ వల్ల ఎదుగుదల ఆగదు. పైగా ఎముకల సాంద్రత పెరుగుతుంది.
ప్రమాదం: ఒకవేళ చిన్న పిల్లలు పెద్దల మాదిరిగా విపరీతమైన బరువులు ఎత్తడం, తప్పుడు పద్ధతిలో వ్యాయామం చేస్తే.. ‘గ్రోత్ ప్లేట్స్’ (ఎముకలు పెరిగే భాగాలు) దెబ్బతినే అవకాశం ఉంది. ఇది మాత్రమే అసలైన ముప్పు.

Kidsgym
ఏ వయసులో ఏది ముఖ్యం?
డాక్టర్ల సూచనల ప్రకారం వయసును బట్టి వర్కౌట్స్ ఇలా ఉండాలి.
3-6 ఏళ్లు: అసలు జిమ్ అవసరమే లేదు. కేవలం ఆటపాటలు, స్విమ్మింగ్, సైక్లింగ్ చాలు. వీటివల్ల వారిలో సృజనాత్మకత, సామాజిక స్పృహ పెరుగుతాయి.
7-12 ఏళ్లు: ఈ వయసులో మెల్లగా ‘బాడీ వెయిట్’ ఎక్సర్సైజులు మొదలుపెట్టొచ్చు. అంటే స్క్వాట్స్, పుష్ అప్స్, రెసిస్టెన్స్ బ్యాండ్స్ వంటివి వాడొచ్చు.
13 ఏళ్ల తర్వాత: ఎముకలు పరిపక్వం చెందిన తర్వాతే.. అంటే యుక్తవయసు వచ్చిన తర్వాతే పక్కా వెయిట్ లిఫ్టింగ్ జోలికి వెళ్లడం సురక్షితం.
మానసిక స్థితిపై ప్రభావం..
ఇక జిమ్ సంస్కృతి వల్ల పిల్లల్లో అప్పుడే ‘బాడీ ఇమేజ్’ (తమ శరీరం ఎలా ఉందనే ఆందోళన) పెరిగే అవకాశం ఉందని మనస్తత్వవేత్తలు హెచ్చరిస్తున్నారు. పక్కవాడి కంటే గొప్పగా ఉండాలని, పర్ఫెక్ట్ కండరాలు రావాలని ఒత్తిడి చేస్తే.. అది వారిలో ఆత్మన్యూనత భావానికి దారితీయవచ్చు. జిమ్ అనేది వారి క్రమశిక్షణను పెంచాలి కానీ, ఒత్తిడిని కాదు. పిల్లలు జిమ్‌కి వెళ్లడం తప్పు కాదు. కానీ అది కేవలం శారీరక కదలికల చుట్టూ ఉండాలి తప్ప పర్ఫార్మెన్స్ చుట్టూ కాదు. వారు పర్ఫెక్ట్ స్క్వాట్స్ చేస్తున్నారా? లేదా? అన్నది కాదు ముఖ్యం. వారు ఎంత ఉత్సాహంగా, చురుగ్గా పెరుగుతున్నారు అన్నదే ఇక్కడ ప్రధానం!
డాక్టర్‌ను అడగాల్సిందే!
పిల్లల ఫిట్నెస్ ప్రయాణాన్ని ఉత్సాహంగా మొదలుపెట్టే ముందు, వారి ఆరోగ్య స్థితిగతులపై తల్లిదండ్రులకు స్పష్టత ఉండాలి. ఇందుకోసం పీడియాట్రీషియన్ (పిల్లల డాక్టర్) సలహా తీసుకోవడం తప్పనిసరి.
దీర్ఘకాలిక సమస్యలు: పిల్లవాడికి ఆస్తమా (ఉబ్బసం), గుండె సంబంధిత ఇబ్బందులు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఉన్నప్పుడు సొంతంగా వ్యాయామాలు చేయించకూడదు.
బరువు హెచ్చుతగ్గులు: ఒబేసిటీ (అధిక బరువు), అండర్‌వెయిట్ (తక్కువ బరువు) సమస్యలు ఉన్న పిల్లలకు ఏ రకమైన శ్రమ సరిపోతుందో వైద్యులే నిర్ణయించాలి.
అసాధారణ సంకేతాలు: ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసిన తర్వాత పిల్లలు విపరీతంగా అలసిపోతున్నా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా, శరీరంలో ఎక్కడైనా విపరీతమైన నొప్పి వస్తున్నా వెంటనే అలర్ట్ అవ్వాలి.
మానసిక స్థితి: వ్యాయామం అంటే భయపడటం, విపరీతమైన యాంగ్జయిటీ (ఆందోళన)కి గురవ్వడం, అసలు మోటివేషన్ లేకపోవడం వంటివి కనిపిస్తే.. అది శారీరక సమస్యేనా, మానసిక ఒత్తిడా అనేది నిపుణుల ద్వారా తెలుసుకోవాలి.
వీటిని పాటించాల్సిందే!
సూపర్విజన్ తప్పనిసరి: పిల్లలు జిమ్‌కి వెళ్తున్నా, ఇంట్లో వ్యాయామం చేస్తున్నా కచ్చితంగా ప్రొఫెషనల్ కోచ్ ఉండాలి.
స్క్రీన్ టైమ్ వర్సెస్ ప్లే టైమ్: ఫోన్లలో గడిపే సమయాన్ని తగ్గించి, వారిని శారీరక శ్రమ వైపు మళ్లించడమే అసలైన విజయం.
ఫన్ ఎలిమెంట్: వ్యాయామం వారికి ఒక శిక్షలా కాకుండా, ఎంజాయ్ చేసే ఆటలా అనిపించాలి.
వీటిని ప్రయత్నించొచ్చు..
పిల్లల్లో శారీరక శ్రమను పెంచడానికి కొన్ని ప్రత్యేక యాక్టివిటీస్ ఉన్నాయి. కాబట్టి, వారిని జిమ్ బదులుగా.. ఈ యాక్టివిటీస్‌లో చేర్పిస్తే బాగుంటుందనేది నిపుణుల సూచన.
రికమెండెడ్ యాక్టివిటీస్: ఫన్ మూవ్మెంట్స్, పరిగెత్తడం, దూకడం, ఎక్కడం, దిగడం
స్కిల్ బిల్డింగ్ యాక్టివిటీస్: బ్యాలెన్స్ బీమ్ వాకింగ్, జంపింగ్ రోప్
బాల్ గేమ్స్: థ్రోయింగ్, క్యాచింగ్, కికింగ్
స్ట్రెంగ్త్: యానిమల్ వాక్స్ (బేర్ క్రాల్, క్రాబ్ వాక్), సిట్ అప్స్, పుష్ అప్స్,క్లయింబింగ్
ఫ్లెక్సిబిలిటీ కోసం: యోగా ఫర్ కిడ్స్, డ్యాన్స్, మార్షల్ ఆర్ట్స్
(బేసిక్ లెవెల్)