సమ్మర్ డ్రింక్స్… మండే ఎండలకు చల్లని పరిష్కారం. ఎండవేళ బయటనుంచి వచ్చాక చల్ల చల్లగా ఓ డ్రింక్గొంతులోకి జారితే కలిగే తాజా అనుభూతి మాటల్లో చెప్పలేం. అది కూడా అటు రుచితో పాటు ఇటు ఆరోగ్యాన్నిఇచ్చేదైతే ఇంకెంత బాగుంటుందో. అందుకే మన దేశీ రుచులకు ఇంటర్నేషనల్ ట్విస్ట్ జత చేసి తయారవుతున్న ఫ్యూజన్ డ్రింక్స్ నేటి తరాన్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. గుల్కంద్ మోజిటో, మామిడి చిల్లీ మార్గరిటా, డ్రాగన్ ఫ్రూట్స్ లెమన్ స్లాష్ లాంటి రకరకాల డ్రింక్స్ అటు కేఫ్‌ల నుంచి ఇటు ఇంటి కిచెన్ల వరకు ట్రెండ్ అవుతున్నాయి. మార్కెట్లో దొరికే కార్బొనేటెడ్ డ్రింక్స్‌కు బదులుగా తాజాగా తయారు చేసే నేచురల్ సమ్మర్ కూలెంట్స్ శరీరానికి ఎంతో హాయిని కలిగిస్తాయి. మరి ఎండవేళ మనమూ చెప్పేద్దామా చల్లదనానికి చీర్స్!

తీపి మామిడి రుచికి చిల్లీ ఫ్లేక్స్ కారాన్ని జత చేసే ఫ్యూజన్ డ్రింక్ ఇది. మొదట తీపిగా అనిపించినా తర్వాత తగిలే కారం రుచి ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది. మామిడిని ఇష్టపడుతూ డిఫరెంట్ టేస్ట్ కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్. వేసవిలో అలసట, నీరసం తగ్గిస్తూ తక్షణ శక్తిని అందిస్తుంది.
మామిడి గుజ్జు : ఒక కప్పు
నిమ్మరసం: ఒక టేబుల్ స్పూన్
తేనె: రెండు టేబుల్ స్పూన్లు
రెడ్ చిల్లీ ఫ్లేక్స్: పావు టీ స్పూను
చల్లటి నీరు: అరకప్పు
ఐస్ క్యూబ్స్: నాలుగు
మామిడి పండును శుభ్రంగా కడిగి గుజ్జు తీసుకోవాలి. లేదా మామిడి పండ్ల ముక్కలను బ్లెండర్లో వేసుకోవచ్చు. మామిడి గుజ్జులో చల్లటి నీరు పోసి తేనె, నిమ్మరసం కూడా వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. గ్లాసులో పోసుకున్నాక ఐస్ క్యూబ్స్ జత చేసి పైన చిల్లి ఫ్లేక్స్ చల్లి సర్వ్ చేసుకుంటే విభిన్నమైన రుచితో మామిడి చిల్లీ మార్గరిటా ట్రై చేయొచ్చు.

లిచీ పండ్ల సహజ తీపి, రోజ్ సిరప్ సువాసన కలగలిసి ఈ డ్రింక్‌ను సమ్మర్ స్పెషల్‌గా మారుస్తాయి. రిప్లేషన్ ఫ్యూజన్ డ్రింక్‌లలో లిచీ కూలర్ ఇప్పుడు యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. గులాబీ రంగులో చూడటానికి ఎంతో అందంగా ఉండే ఈ డ్రింక్ రుచిలో కూడా తగ్గేదేలే అనిపిస్తుంది. ఇందులో రోజ్ సిరప్ శరీరాన్ని చల్లబరిస్తే, తేనె – నిమ్మరసాలు తక్షణ శక్తి అందిస్తాయి.
లిచీ పండ్లు: 8 నుంచి 10
రోజ్ సిరప్: రెండు టేబుల్ స్పూన్లు
చల్లటి నీరు లేదా సోడా: ఒక కప్పు
నిమ్మరసం: టీ స్పూన్
పుదీనా ఆకులు: అయిదారు
ఐస్ క్యూబ్స్: 5
ముందుగా లిచీ పండ్లను శుభ్రం చేసుకుని గింజలు తీసేసి గుజ్జుని మిక్సీలో బ్లెండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసి తయారు చేసి పెట్టుకున్న లిచీ జ్యూస్ పోయాలి. అందులో రోజ్ సిరప్ వేసి నిమ్మరసం కూడా కలపాలి. తర్వాత మన అభిరుచిని బట్టి చల్లటి నీరు లేదా సోడా జత చేసి నెమ్మదిగా కలపాలి. పైన పుదీనా ఆకులతో గార్నిష్ చేస్తే నోరూరించే రోజ్ లిచీ కూలర్ రెడీ!

వేసవి తాపానికి చక్కని మందు తాటి ముంజలు, కొబ్బరి నీటితో చేసే ఈ డ్రింక్. మృదువైన ముంజల తీపి, కొబ్బరి నీటి సహజ సుగుణాలు కలగలిసిన ఇది శరీరానికి సహజ ఎనర్జీ బూస్టర్‌గా చెప్పొచ్చు. కొబ్బరి నీటిలో ఉండే ఎలక్ట్రోలైట్స్ శరీరం డిహైడ్రేషన్‌కి గురి కాకుండా సహకరిస్తాయి. గ్రామీణ రుచుల్ని మోడ్రన్ స్టయిల్లో పరిచయం చేసే ఈ డ్రింక్ ఎవరికైనా ఇట్టే నచ్చేస్తుంది.
తాటి ముంజలు: నాలుగు
కొబ్బరి నీళ్లు: రెండు కప్పులు
తేనె: ఒక టేబుల్ స్పూన్
నిమ్మరసం: ఒక టీ స్పూన్
పుదీనా ఆకులు: నాలుగైదు
ఐస్ క్యూబ్స్: అయిదు
ముందుగా లేత తాటి ముంజలను చెక్కు తీసుకొని చిన్న ముక్కలుగా తరిగి పక్కకు పెట్టుకోవాలి. గ్లాస్లో కొబ్బరి నీళ్లు పోసి అందులో ఐస్ క్యూబ్స్ వేయాలి. తర్వాత తేనె, నిమ్మరసాలను కలుపుకోవాలి. ఇప్పుడు అదే గ్లాసులో ఇందాక తరిగి పక్కకు పెట్టుకున్న తాటి ముంజల ముక్కలను వేసి పుదీనా ఆకులతో పైన గార్నిష్ చేసి చల్లగా తాగేయడమే!

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న సమ్మర్ డ్రింక్స్‌లో డ్రాగన్ ఫ్రూట్ స్లాష్ ఒకటి. దీని గులాబీ రంగు పిల్లల్ని, పెద్దల్ని ఆకట్టుకుంటుంది. ఆకర్షణలోనే కాదు ఆరోగ్య ప్రయోజనాల్లోనూ దీనికి ఇదే సాటి. డ్రాగన్ ఫ్రూట్లో పుష్కలంగా ఉండే యాంటి ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో నిమ్మరసం కలవడం వల్ల విభిన్నమైన రుచి కూడా వస్తుంది.
డ్రాగన్ ఫ్రూట్ గుజ్జు: ఒక కప్పు
నిమ్మరసం: రెండు టేబుల్ స్పూన్లు
తేనె లేదా షుగర్ సిరప్:
ఒక టేబుల్ స్పూన్
చల్లటి సోడా లేదా నీరు: ఒక కప్పు
పుదీనా ఆకులు: ఐదారు
ఐస్ క్యూబ్స్: 5
ముందుగా డ్రాగన్ ఫ్రూట్‌ను చెక్కు తీసి గుజ్జును మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి. గాజు గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసి డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ పోయాలి. అందులో నిమ్మరసం, తేనె కలిపి బాగా గిలక్కొట్టాలి. సాదాగా తాగాలనుకుంటే ఇందులో నీరు పోసుకుని పుదీనా ఆకులు చల్లుకుంటే సరి. కాస్త ప్రత్యేకంగా కావాలనుకుంటే చిల్డ్ సోడా కలిపి పుదీనాను కాస్త నలిపి పైపైన వేసుకుంటే బాగుంటుంది.

వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో పుచ్చకాయ ఎంతగానో సహాయపడుతుంది. ఇందులోని నీటి శాతం శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా శరీర ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తుంది. తులసి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇప్పుడు కేఫ్‌లలో పుచ్చకాయకు తులసి ఆకులు, సోడా జత చేసి తయారు చేస్తున్న ఫ్యూజన్ మోజిటోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. అటు తులసి ఆకుల సహజ సువాసన, పుచ్చకాయ తీపి కలిపి డ్రింక్‌ను మరింత రిఫ్రెషింగ్‌గా మారుస్తున్నాయి. సాయంత్రం పార్టీలకు, గెట్ టుగెదర్స్కు ఇది పర్ఫెక్ట్ సమ్మర్ డ్రింక్.
పుచ్చకాయ ముక్కలు: రెండు కప్పులు
తులసి ఆకులు: 8
నిమ్మరసం: ఒక టేబుల్ స్పూన్
తేనె లేదా షుగర్ సిరప్: ఒక టేబుల్ స్పూన్
చల్లటి సోడా: అరకప్పు
ఐస్ క్యూబ్స్: ఐదు
పుచ్చకాయను ముక్కలుగా చేసి జ్యూస్ తీసుకోవాలి. తులసి ఆకులను శుభ్రంగా కడిగి అరచేతుల్లో నలిపి గ్లాసులో వేసుకోవాలి. అందులోనే తేనె వేసి పుచ్చకాయ జ్యూస్ కూడా పోయాలి. గ్లాసులో నిమ్మరసం పిండుకొని సోడా పోసి నెమ్మదిగా కలిపి చల్లగా సర్వ్ చేయాలి.

ఉత్తర భారతీయ గుల్కంద్ రుచిని మోజిటో స్టయిల్లోకి మార్చిన ఈ డ్రింక్ ఇప్పుడు యువతలో బాగా ట్రెండ్ అవుతున్నది. గులాబీ సువాసన, పుదీనా తాజాదనం కలిసి వేసవిలో ఇది శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. తీపి తక్కువగా, సువాసన ఎక్కువగా ఉండటంతో ఒక్కసారి తాగితే మళ్లీ కావాలనిపించే రుచితో ఉంటుంది ఇది. ఇందులోని గుల్కంద్ శరీరానికి సహజ చల్లదనాన్ని అందిస్తే, పుదీనా తాజాదనంతో తలనొప్పి, నీరసం మాయమైపోతాయి.
గుల్కంద్: రెండు టేబుల్ స్పూన్లు
పుదీనా ఆకులు: 10
నిమ్మరసం: రెండు టేబుల్ స్పూన్లు
చక్కెర సిరప్: ఒక టేబుల్ స్పూన్
సోడా: ఒక గ్లాసు
ఐస్ క్యూబ్స్: ఐదు
గ్లాసులో గుల్కంద్ వేసుకోవాలి. పుదీనా ఆకుల్ని శుభ్రంగా కడిగి చక్కటి వాసన వచ్చేలా అరచేతుల్లో నలపాలి. దీన్ని గుల్కంద్లో వేసి అందులో నిమ్మ చెక్క పిండుకోవాలి. చక్కెర సిరప్ కూడా కలిపి ఐస్ క్యూబ్స్ గ్లాసులో వేయాలి. చివరగా సోడా పోసి నెమ్మదిగా కలిపి సర్వ్ చేసుకుంటే పాన్ పరిమళంతో గుల్కంద్ మోజిటో రుచి చూసేయొచ్చు.