ఓ ప్రాంతానికే పరిమితమైన ప్రత్యేక రుచి గురించి తెలియాలంటే అక్కడి స్ట్రీట్ ఫుడ్ ఆస్వాదించాలి. పానీపూరీ నుంచి మసాలా వడ వరకు.. ప్రతి ఊళ్లోనూ ఏదో ఓ స్ట్రీట్ ఫుడ్ ఉండనే ఉంటుంది. ఆకలి తీరుస్తూనే, ఆత్మారాముడినీ సంతృప్తి పరచడం ఈ వంటకం ప్రత్యేకత. ఫుడ్ బ్లాగర్స్, వ్లాగర్స్ పుణ్యమాని మారుమూల స్ట్రీట్ ఫుడ్ కూడా ఇప్పుడు అందరికీ పరిచయం అవుతున్నది. ఈ విషయంలో మరికాస్త చొరవ చూపిస్తున్నారు సోనాల్ వేద్. ఆమె తాజా రచన ‘ఇండియా లోకల్’. సోనాల్ ఇంతకుముందే ఆహార శాస్త్రం మీద అనేక పుస్తకాలు రాశారు. టిఫిన్స్ పేరుతో ఏకంగా 500 అల్పాహారాల వివరాలు అందించారు.
ఇక ‘ఇండియా లోకల్’లో కశ్మీర్ నుంచి డార్జిలింగ్ వరకు వైవిధ్యమైన 140 స్ట్రీట్ ఫుడ్స్ పరిచయం చేశారు. ఒకేలా కనిపించే, ఒకే పేరుతో విక్రయించే ఆహార పదార్థాల రుచి సైతం ప్రాంతానికి, ప్రాంతానికి మారిపోతూ ఉంటుందని చెబుతారు సోనాల్. వాటి వెనుక ఉండే భిన్నమైన దినుసుల కథలు తెలుసుకోవడం ఆమెకు మహా ఆసక్తి. సోనాల్ ప్రయాణం ఇక్కడితో ఆగ లేదు. పూర్తి శాకాహార రుచుల గురించీ, ప్రసాదాల గురించీ కూడా పుస్తకాలు రాయాలని అనుకుంటున్నారు. మొత్తంగా భారతీయ ఆహారం మీద ఓ డాక్యుమెంటరీ రూపొందించే ఆలోచనలోనూ ఉన్నారు.