‘అద్దం’ ముందు నిలబడి మాటలు, పాటలు ప్రాక్టీస్ చేయడం.. మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పెద్ద పెద్ద నటులు, వ్యాఖ్యాతలు కూడా ‘అద్దం ఎదురుగా’ నిల్చొని ప్రాక్టీస్ చేసినవారే. పిల్లల్లో ఏకాగ్రత పెంచడానికి మిర్రర్ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుందని ఇటీవలి సర్వేల్లో తేలింది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచడంలో మిర్రర్.. మిరాకిల్స్ చేస్తుందని వెల్లడైంది.
కొందరు పిల్లల్లో చదువుపై ఏకాగ్రత తక్కువగా ఉంటుంది. చేతిలో పుస్తకం ఉన్నా.. పాఠాలపై దృష్టి పెట్టకుండా, ఎక్కడో చూస్తూ ఉంటారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. పిల్లల్లో స్వీయ ప్రేరణ పొందడం అవసరం. ఈ పనిలో అద్దం పెద్దసాయమే చేస్తుంది. పిల్లల గదిలో ఓ అద్దం ఏర్పాటు చేయండి. వారు చదువుకుంటూ.. అద్దంలో తమను తాము చూసుకునప్పుడు, స్వీయ ప్రేరణ పొందుతారని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఒక చిన్న మార్పు.. పిల్లలను ఎంతో ప్రేరేపిస్తుందని అంటున్నారు.
కమ్యూనికేషన్ స్కిల్స్..
ఈకాలం పిల్లలకు చదువుతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ముఖ్యమే. పిల్లలకు తెలిసిన విషయం, వారు అనుకున్న విషయాన్ని అందరిముందూ స్పష్టంగా, నిర్భయంగా చెప్పే నేర్పు ఉండాల్సిందే! పిల్లల అభిప్రాయాలు, వ్యక్తిత్వాలను తీర్చిదిద్దడంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే కొందరు పిల్లల్లో భయం, జంకుతూ మాట్లాడటం కనిపిస్తుంది. ఓ నిలువు అద్దాన్ని వారి దగ్గరికి చేరిస్తే.. ఈ భయం, జంకు అన్నీ దూరం అవుతాయి. రోజూ అద్దం ఎదుట నిలబడి మాట్లాడటం వల్ల.. తాము ఎలా మాట్లాడుతున్నామో, ఎలా మాట్లాడాలో కూడా వాళ్లకు వాళ్లే అర్థం చేసుకుంటారు. దాంతో పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇదే ధైర్యం.. చదువులోనూ కొనసాగుతుంది.
దృశ్యం ముఖ్యం..
కొందరు పిల్లలు శ్రద్ధగా చదువుతారు. కానీ, ఉదయం పాఠశాలకు వెళ్లేసరికి అన్నీ మరచిపోతారు. ఈ మతిమరుపును ‘మిర్రర్ టెక్నిక్’ ద్వారా పోగొట్టొచ్చు. పుస్తకాల్లో చదివినదాని కన్నా, టీవీల్లో చూసిన వాటినే పిల్లలు ఎక్కువగా గుర్తుంచుకోవడం మీరు గమనించే ఉంటారు. అంటే, దృశ్య రూపంగా చూసేది.. పిల్లల మస్తిష్కంలో ఎక్కువగా పాతుకుపోతుంది. అందుకే, పిల్లలు అద్దంలో తమను తాము చూసుకుంటూ ఏదైనా మాట్లాడినా, చదివినా.. అది దృశ్య రూపకంగా మారి వారి మెదడులో ఎక్కువకాలం నిలిచి ఉంటుందన్నమాట!