ఆ యువతికి అంతకుముందు ఎలాంటి సినిమా అనుభవమూ లేదు. అయితేనేం, ఆమె దగ్గరున్న సబ్జెక్ట్ ప్రొడ్యూసర్ గునీత్ మోంగాను ఆకట్టుకుంది. అందులో డ్రామా లేదు. సస్పెన్స్ లేదు. కానీ జీవితం ఉంది. ఉద్వేగాలున్నాయి. అందుకే, వెంటనే ఆమోదం తెలిపారు. అలా కార్తికి గోన్సాల్వే స్క్రిప్ట్‌కు ఓ నిర్మాత దొరికారు. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్?’ అనే డాక్యుమెంటరీ ప్రాణంపోసుకుంది. ఆస్కార్ న్యాయనిర్ణేతల దృష్టినీ ఆకర్షించింది.
రఘు అనే ఏనుగు పిల్లతో బొమ్మన్, ఆయన భార్య బాలికి ముడిపడిన బంధాన్ని ఈ డాక్యుమెంటరీ ఆవిష్కరించింది. ఆ దంపతులు మనుషులతో సంభాషించినట్టుగానే ఏనుగుతోనూ మాట్లాడటం, అది కూడా వాళ్ల భావాల్ని అర్థం చేసుకొని చెప్పినట్టు వినడం.. ఇలా ప్రతిఘట్టం అపురూపమే. పిల్లలులేని ఆ ఇంట ఏనుగు పిల్లే పసిబిడ్డ అవుతుంది. దాని కోసం జీవనశైలిని కూడా మార్చుకుంటారు. డాక్యుమెంటరీలో ఎక్కడా కృత్రిమత్వం లేకుండా.. పక్షుల కిలకిలరావాలు, సెలయేటి గలగలలు, గాలిచప్పుడు.. సింక్ అండ్ సౌండ్ టెక్నాలజీ ద్వారా రికార్డు చేశారు కార్తికి. తను స్వతహాగా వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్. స్వస్థలం బెంగళూరు. అమ్మ అమెరికన్, తండ్రి భారతీయుడు.