అమ్మ అరచేయి పొట్ట మీద జోకొడుతుంటేనే బుజ్జి పాప నిద్రపోయేది. ఆ చేయి పక్కకు జరిగిందో నిద్రలేచే పిల్లలు ఎందరో. కానీ ఎంత సేపని చేయి తీయకుండా కూర్చోగలం. అలాంటి సందర్భాల్లో చక్కగా ఉపయోగపడేలా ‘బేబీ స్లీప్ సూతింగ్ పామ్ పిల్లోస్’ దొరుకుతున్నాయి. ఇవి అచ్చంగా నూలుతో చేసినవి. మనుషుల చేతిని పోలి ఉంటాయి. అంతేకాదు, మీద చేయి వేసినట్టే అనిపించేందుకు కాస్త బరువు జోడించి రూపొందిస్తున్నారు.
అందువల్ల ఈ ‘చేయి దిండు’ను పాపాయి మీద ఉంచితే తన మీద ఎవరో చేయి వేసుకుని పడుకున్న అనుభూతిని పొందుతారు. హాయిగా నిద్రపోతారు. జాకీ అనే మరో సంస్థ కూడా జాకీ హగ్ పేరిట ఈ తరహాలో పిల్లలను చుట్టేసేలా.. చేతులను పోలిన దిండ్లను తయారు చేస్తున్నది. ఇవి కూడా బిడ్డలను నిద్రపుచ్చడానికి పనికొస్తాయి. వీటితో ఇటు అమ్మ ఎంచక్కా పనిచేసుకోవచ్చు, పాపాయి హాయిగా బజ్జోవచ్చు. ఐడియా అదిరింది కదూ!