కలల్ని నిజం చేసుకోవడంలో కిక్ ఉంది. ఎవరో వేసిన ఎంగిలిదార్లో వెళ్లకుండా.. మనదైన రాచబాట నిర్మించుకోవడంలో సంతృప్తి ఉంది. ఆ విషయం నిర్మల్‌కు చెందిన నిశితకు బాగా తెలుసు. కాబట్టే, తనను తాను వెతుక్కుంటూ ముంబై వెళ్లింది. తళుకుబెళుకుల ప్రపంచంలో తనకంటూ ఓ ఉనికిని చాటుకుంది.
నిశిత బీటెక్ చేసింది. నిర్మల్‌లోని ఆదర్శ్ నగర్ కాలనీలో ఉంటుంది వాళ్ల కుటుంబం. తల్లిదండ్రులు.. సరళ, తిరు నగరి మనోహర్ స్వామి. నిర్మల్‌లోనే ఓ రెండేండ్లు వర్క్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తించింది. పాఠశాల స్థాయి నుంచే నిశితకు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలంటే ఇష్టం. దీంతో, సృజనకు ఏమాత్రం ఆస్కారం లేని ఆ కొలువు సంతృప్తిని ఇవ్వలేదు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాలని తపించింది. ఇష్టమైన మాడలింగ్ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకుంది. ముంబైలోని కోకోబేరి సంస్థలో మాడలింగ్, సెల్ఫ్ డిఫెన్స్, ఫ్యాషన్ టెక్నాలజీలో శిక్షణ తీసుకుంది. రష్యాకు చెందిన అంతర్జాతీయ మాడల్ అలీసియారౌత్ ఆమెకు ఫ్యాషన్ పాఠాలు బోధించింది.
ఆ నైపుణ్యంతో అందాల పోటీల్లో పాల్గొంటూ ప్రతిభను చాటుతున్నది నిశిత. ఇటీవల ముంబైలో నిర్వహించిన ‘క్వీన్ ఆఫ్ వరల్డ్-2022’ పోటీల్లో ‘మిస్ ఫొటోజెనిక్ క్వీన్’ టైటిల్ సొంతం చేసుకుంది. గత జూలైలో జరిగిన ‘మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెన్స్-2022’కు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించింది. జాతీయ స్థాయిలో ‘మిస్ యాక్టివ్’గానూ ఎంపికైంది. అంతేనా, ‘మిస్ సోషల్ క్వీన్’ టైటిల్‌ను సైతం చేజిక్కించు కుంది. నిశితకు సామాజిక సేవ అంటే ఇష్టం. ‘ప్రాజెక్ట్ స్ఫూర్తి’ పేరిట ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి మహిళల్లో ఆత్మరక్షణ నైపుణ్యాలు పెంపొందిస్తున్నది. ఇప్పటివరకు 1,100 మందికి శిక్షణ ఇచ్చింది. భారత్‌కు మిస్ వరల్డ్ టైటిల్ అందించాలన్నదే తన లక్ష్యమని చెబుతున్నది నిశిత.
…? మాధాపురం మహేశ్