ట్రావెల్ ఇన్సూరెన్స్ అనగానే.. చాలామంది పెదవి విరుస్తారు. ‘వారం-పది రోజుల కోసంకూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలా?’ అని ఆలోచిస్తారు. కానీ, అనుకోని పరిస్థితుల్లో ప్రయాణాలు రద్దయితే.. నాలుక కరుచుకుంటారు. ముందుగా చెల్లించిన అడ్వాన్స్ డబ్బులకు నీళ్లు వదిలేస్తారు. అందుకే.. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌తోపాటు ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ముఖ్యమేనని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ వర్షాకాలంలో చేసే ప్రయాణాలు, అంతర్జాతీయ యాత్రలకు ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాల్సిందేనని అంటున్నారు.
మనదేశంలోని ప్రముఖ పర్యాటక క్షేత్రాల్లో అత్యధికం అటవీ, పర్వత ప్రాంతాలే! ఆయాచోట్ల ఆకస్మిక వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం, దట్టమైన పొగమంచు కమ్ముకోవడం లాంటి సమస్యలు రావడం కూడా షరామామూలే! దీంతో ప్రయాణ ప్రణాళికలన్నీ తలకిందులయ్యే అవకాశం ఉంటుంది. ముందుగా బుక్ చేసుకున్నవన్నీ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. రైలు, విమాన టికెట్లకు రిఫండ్ వచ్చినా.. హోటల్ బుకింగ్స్, టూర్ ప్యాకేజీ ఖర్చులను వదులుకోవాల్సిందే! ఇలాంటి సందర్భాల్లోనే ట్రావెల్ ఇన్సూరెన్స్ మీకు అండగా నిలుస్తుంది. మీ జేబుకు చిల్లు పడకుండా కాపాడుతుంది.
భారీ వర్షాల వల్ల విమానాలు ఆలస్యంగా నడుస్తుంటాయి. ఒకవేళ మీ ఫ్లయిట్ నిర్ణీత సమయం కంటే ఎక్కువ ఆలస్యమైతే.. ఆ సమయంలో మీ భోజనానికి, అవసరమైన వస్తువులకు, హోటల్ వసతికి అయ్యే ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. అంతేకాదు.. డొమెస్టిక్ ఫ్లయిట్ ఆలస్యం కావడం వల్ల మీరు వెళ్లాల్సిన ఇంటర్నేషనల్ ఫ్లయిట్ (కనెక్టింగ్ ఫ్లయిట్) మిస్ అయితే.. ప్రత్యామ్నాయ ఫ్లయిట్ బుక్ చేసుకోవడానికి, ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేసుకోవడానికి అయ్యే ఖర్చులను ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది.
వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల మీరు వెళ్లాలనుకున్న ప్రదేశానికి దారి పూర్తిగా మూసుకుపోతే, ప్రయాణాన్ని పూర్తిగా రద్దు చేసుకోవాల్సి రావచ్చు. అలాంటప్పుడు మీరు అడ్వాన్స్‌గా చెల్లించిన హోటల్ బుకింగ్స్, స్థానిక టూర్ ప్యాకేజీలు, అడ్వెంచర్ గైడ్ ఖర్చులు, కార్ రెంటల్ బిల్స్‌ను ఇన్సూరెన్స్ ద్వారా తిరిగి పొందవచ్చు.
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఇతర వైరల్ జ్వరాలు వేగంగా వ్యాపిస్తాయి. ఒకవేళ మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరాల్సి వస్తే.. ఆ అత్యవసర వైద్య ఖర్చులను ఈ పాలసీ కవర్ చేస్తుంది.
ఇవి గమనించాల్సిందే..
అయితే, అన్ని ఇన్సూరెన్స్ పాలసీలు ఒకేలా ఉండవు.
ముఖ్యంగా వర్షాకాలంలో పాలసీ తీసుకునేటప్పుడు కొన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి.