కోల్‌కతా నివాసి సమీర్‌కు లెదర్ బిజినెస్ ఉంది. స్థిరమైన జీవితం. ఓసారి తన తల్లి మొబైల్లో ఓ అందమైన అమ్మాయి ఫొటో చూశాడు. ఆమె పేరు జవేరియా అనీ, పాకిస్థాన్‌లో ఉంటున్న దూరపు చుట్టమనీ తెలిసింది. అది ‘లవ్ ఎట్ ఫస్ట్ స్క్రీన్’ కావచ్చు. సమీర్ ఫోన్ చేసి జవేరియాకు తన మనసులోని మాట చెప్పాడు. అది ‘లవ్ ఎట్ ఫస్ట్ కాల్’ కావచ్చు. ఆమెకు అతను నచ్చేశాడు. ఇరు కుటుంబాలూ థాయ్‌లాండ్‌లో కలుసుకుని ఎంగేజ్మెంట్ పూర్తిచేశారు. ఇక పెళ్లి మాత్రమే మిగిలింది. అంతలోనే అనూహ్యమైన సమస్య వచ్చింది. జవేరియా వీసా ఒకటికి రెండుసార్లు తిరస్కరణకు గురైంది. తాజాగా జరిగిన కొన్ని వివాదాస్పద ప్రేమ ప్రయాణాలు ఇందుకు కారణం.
ఈ నేపథ్యంలో పంజాబ్‌కు చెందిన మక్బూల్ అహ్మద్ అనే సామాజిక కార్యకర్త, వీరిద్దరినీ కలిపేందుకు ముందుకొచ్చాడు. మానసిక ధైర్యాన్ని అందించడం నుంచివీసా అప్లికేషన్‌ను సజావుగా పూర్తిచేయడం వరకు ప్రతి దశలో అండగా నిలిచాడు. నవంబరులో వీసా చేతికి వచ్చింది. జవేరియా వాఘా సరిహద్దు ద్వారా భారత్‌లో అడుగుపెట్టింది. కాబోయే కోడలిని ఆహ్వానించేందుకు సమీర్ కుటుంబం వాఘాకు చేరుకుంది. జనవరి ఆరున వివాహబంధంతో ఒకటయ్యేందుకు సమీర్, జవేరియా జంట ఏర్పాట్లు చేసుకుంటున్నది. ‘మంచి మనసుల సాయం వల్ల నా కల నిజమైంది’ అంటున్నది కాబోయే వధువు జవేరియా!