బిడ్డ పుట్టగానే బాధ్యత తీరిపోయిందని ఏ తల్లీ అనుకోదు. ఆ బుజ్జాయిని గొప్ప మనిషిగా తీర్చిదిద్ది, ఈ లోకానికి అందించేవరకూ ఆమె విశ్రమించదు. ఆ ప్రయాణంలో ప్రతి అడుగూ ఓ అద్భుతమే! అందుకే తల్లీబిడ్డల మధ్య బంధం పరిశోధకులకి ఓ హాట్ టాపిక్! అలా ఈమధ్య జరిగిన ఓ పరిశోధనలో, తల్లి లాలిపాట కూడా చిన్నారి ఎదుగుదల మీద గొప్ప ప్రభావం చూపుతుందని తేలింది.
ప్రాంతానికీ, భాషకీ అతీతంగా ప్రపంచంలోని ప్రతి తల్లీ తన బిడ్డని పాటతో లాలిస్తుంది. అసలు సంగీతం లాలిపాటతోనే మొదలైందని అంటారు. ప్రపంచంలో బెస్ట్ సింగర్ తల్లే అని ఒప్పుకొంటారు. అందుకే మియామీ యూనివర్సిటీ పరిశోధకులు చిన్నారుల మీద తల్లి లాలిపాట ప్రభావం గురించి పరిశోధించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం వారు 70 మంది పసిపిల్లలని గమనించారు.
తల్లి లాలిపాట పాడుతున్నప్పుడు వారి మానసిక స్థితినీ, వేరే సంగీతం వింటున్నప్పుడు వారి ఉద్వేగాలనీ పరిశీలించారు. లయబద్ధంగా, ప్రేమగా సాగే లాలిపాటని వినగానే పిల్లల్లో అలజడి సద్దుమణిగిపోతున్నట్లు తేలింది. లాలిపాట పాడుతున్నప్పుడు బుజ్జాయి తల్లి వంకే చూస్తుంటుంది. ఆ చిన్నారి స్పందనలకు అనుగుణంగా తల్లి కూడా, పాటలోని లయని మారుస్తూ ఉంటుంది. దీంతో ఇద్దరి మధ్యా గొప్ప అనుబంధం ఏర్పడుతున్నట్లు గమనించారు. లాలిపాటతో పిల్లలు శబ్దాలను కూడా సులువుగా గ్రహించగలుగుతున్నారట. అలా లాలిపాట పిల్లవాడికి భాషని కూడా పరిచయం చేస్తున్నదన్నమాట.
లాలిపాట పాడుతూ చిన్నారితో గడపడం వల్ల తల్లి మనసు కూడా ప్రశాంతత పొందుతున్నట్లు తేలింది. చాలామంది తల్లులు డెలివరీ తర్వాత, శరీరంలోని హార్మోన్ల మార్పులతో డిప్రెషన్‌కు లోనవుతారు. దీన్నే postpartum depression అంటారు. తల్లిలో ఏర్పడే ఈ నిరాశ నుంచి దృష్టి మళ్లించేందుకు లాలిపాట మందులా పనిచేస్తుందట. అంటే అమ్మ తనని తాను సంబాళించుకుంటూ, బుజ్జాయికి ప్రపంచాన్ని పరిచయం చేస్తుందన్నమాట.