చెరువుల కోసం చట్టం తేవాలి!
ఎవరైనా నమ్ముతారా.. కేవలం పర్యావరణాన్ని కాపాడాలనే తపన కోసం తనకంటూ ఎవరూ లేని మహా నగరంలో ఒక అమ్మాయి అడుగుపెట్టిందంటే! ముక్కూ మొహం తెలియని చోట ప్రభుత్వ సాయంతో వేల మొక్కలను పెంచి పెద్ద చేసిందంటే! మురికిగుంటలుగా మారిపోయిన పదికి పైగా చెరువులకు జలకళను తీసుకొచ్చిందంటే!!
ఎవరైనా నమ్ముతారా.. కేవలం పర్యావరణాన్ని కాపాడాలనే తపన కోసం తనకంటూ ఎవరూ లేని మహా నగరంలో ఒక అమ్మాయి అడుగుపెట్టిందంటే! ముక్కూ మొహం తెలియని చోట ప్రభుత్వ సాయంతో వేల మొక్కలను పెంచి పెద్ద చేసిందంటే! మురికిగుంటలుగా మారిపోయిన పదికి పైగా చెరువులకు జలకళను తీసుకొచ్చిందంటే!! అంతేకాదు, తన పనికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అవార్డుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాల్నీఅందుకోగలిగిందంటే!! కానీ ఇది నిజం. ధృవాన్ష్ ఎన్జీవో స్థాపకురాలు మధులిక చౌధరి కథ… అచ్చంగా సినిమాను తలపిస్తుంది. లేక్ ఉమెన్ ఆఫ్ హైదరాబాద్‌గా పేరున్న ఆమెతో ‘జిందగీ’ మాట కలిపింది. ఆ సంగతులు ఆమె మాటల్లోనే..
కొందరికి కొన్ని ఇష్టాలుంటాయి. ఒకరికి పెయింటింగ్. ఒకరికి నాట్యం. మరొకరికి మరోటి. అలా నాకు తొలి నుంచీ మన చుట్టూ ఉండే చెట్లు, పర్యావరణం అంటే ఎనలేని ఆసక్తి. అది బాగుంటే మనం, మన ముందు తరాలూ బాగుంటాయన్న ఆలోచన. ముఖ్యంగా నా బిడ్డలకు ఆస్తులు కాదు ఆరోగ్యంగా ఉండే అవకాశం ఇవ్వాలన్న కోరిక. అయితే, సాధారణ కుటుంబాల్లో పుట్టిన ఎవరికైనా ప్రపంచంలో నడుస్తున్న దానికి భిన్నంగా, ఇష్టమైన పనిని చేయాలంటే కష్టమే. నా పరిస్థితీ అంతే. అందుకే ఈ రోజుల్లోని చాలామంది అమ్మాయిల్లాగే ఇంజినీరింగ్ చేసి మాస్టర్స్ చదివి, కొన్నేళ్లు దానికి సంబంధించి ఉద్యోగమూ చేశాను. కానీ నా ప్రాణం అంతా ప్రకృతి చుట్టూనే. కాబట్టి, ఇదిగో చివరికి ఇక్కడ ఉన్నా. అయితే ఆ ప్రయాణం ఎక్కడ ఎలా మొదలైందంటే..

విదేశాల నుంచి..
అమ్మ అరుణ శర్మ, నాన్న సుధాంశు మోహన శర్మలిద్దరూ సైంటిస్టులు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంగారితో కలిసి అమ్మ పనిచేశారు. వాళ్ల ఉద్యోగ రీత్యా మేం రాజస్థాన్‌లోని పిలానీలో ఉండేవాళ్లం. ఆ క్యాంపస్‌లోనే పెరిగా. అయితే నాకు పురావస్తు పరిశోధకురాలిగానో, అటవీ శాఖలోనో పనిచేయాలన్న ఆశ ఉండేది. కానీ ఇంజినీరింగ్‌కి ఉండే క్రేజ్ వాటికి లేదు. దాంతో అమ్మానాన్నలు కూడా ఆ చదువుకే మొగ్గు చూపారు. తర్వాత కొన్నేండ్లు ఉద్యోగమూ చేశాను. ఈ మధ్యలోనే పెండ్లి, ఇద్దరు పిల్లలు. ఆయనతో కలిసి సింగపూర్‌లో ఉండేదాన్ని. కానీ నా మనసు మాత్రం నాకిష్టమైన పర్యావరణానికి ఏదో ఒకటి చేయాలన్న తపనతో రగిలిపోతూ ఉండేది.
దాంతో నాకు ఏ మాత్రం పరిచయం లేని చోటుకు వెళ్లయినా సరే, నా చేతనైన పని చేయాలని అనుకున్నాను. అలా, 2014లో మా వారిని అడిగి రెండు, అయిదేండ్ల వయసున్న ఇద్దరు పిల్లలను తీసుకుని ఒక్కదాన్నే హైదరాబాద్ వచ్చా. నాకు తెలిసిందంతా ఉత్తర భారతమే. అక్కడ చుట్టాలుంటారు. ఇంత చదువుకున్నావ్.. ఇదేం పని, పర్యావరణాన్ని ఎలా బాగుచేస్తావ్.. టైం వేస్ట్ చేస్తున్నావ్… లాంటి మాటలెన్నో వస్తాయని నాకు తెలుసు. అందుకే నా పనికి దక్షిణ భారతాన్ని ఎంచుకున్నా. మరో విషయం ఏమిటంటే, నేను ఇంతకు ముందు పనిచేసిన ఇక్ఫాయ్ యూనివర్సిటీ ప్రధాన కేంద్రం హైదరాబాద్‌లోనే ఉంది. అసలేదీ నాకు చేతకాకపోతే పాత పనైనా చేసుకుందామని ఓ చిన్న ఆశ.
హరిత హారంతో మొదలు..
ఇక్కడికి వచ్చాక ‘ధృవన్’ పేరిట స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి, చుట్టు పక్కల స్కూళ్లకు వెళుతూ గ్లోబర్ వార్మింగ్, ైక్లెమెట్ చేంజ్ గురించి అవగాహన సదస్సులు నిర్వహించేదాన్ని. చెట్ల పెంపకం, పర్యావరణం పట్ల మన బాధ్యతలాంటివన్నీ చెప్పేదాన్ని. ఎందుకంటే మన సబ్జెక్టుల్లో ఫిజిక్సు, కెమిస్ట్రీ, బయాలజీలు ఉన్నాయి. కానీ, పర్యావరణ శాస్త్రం లేదు. నిజానికి పర్యావరణంలోనే మిగతా సబ్జెక్టులున్నాయని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పేదాన్ని. అలా రెండేండ్లు గడిచాయి. 2016లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ హరితహారంలో భాగంగా ఒకే రోజు 25 లక్షల మొక్కలు నాటాలన్న సంకల్పం చేశారు.
మా ప్రాంతంలో మొక్కలు నాటేందుకు, అప్పటికే పర్యావరణానికి సంబంధించిన వర్క్ చేస్తున్న నన్ను ప్రభుత్వం సంప్రదించింది. ఇక్కడి నెక్నంపూర్ చెరువు చుట్టూ 2 వేల మొక్కలు నాటాలన్నది విషయం. అయితే నాటిన తర్వాత వాటిని పెంచడానికి నాకు మనుషులను ఇస్తాను అంటే, సరి. లేదంటే నేను చేయలేను… అని చెప్పాను. అప్పుడు కేటీఆర్ గారితో మాట్లాడి అదే ఊరికి చెందిన నలుగురు మనుషుల్ని సాయంగా ఇచ్చారు. దానికీ కొంత పోరాటం చేయాల్సి వచ్చిందనుకోండి. చివరికి అనుకున్న మొక్కలన్నీ పెట్టాక, చెరువులోని నీళ్లు తెచ్చి వాటికి పోయడం నాతో కలిపి మేం అయిదుగురం చేయాల్సిన పని. కానీ ఆ చెత్తకుప్పలా ఉన్న ఆ చెరువునూ, మురికి నీళ్లనూ చూసి బాధేసింది. పాతిక ఎకరాల్లో ఉన్న దీనిలో మురుగు, మానవ వ్యర్థాలు కలిసేవి. ఇతర చెత్తా విసిరేవారు. ముందు దీన్ని బాగు చేస్తే చుట్టూ బాగుంటుంది అనిపించింది. అలా నా మనస్సు సరస్సుల పునరుద్ధరణ వైపు మళ్లింది.

రాష్ట్రం నుంచి ఒక్కటే..
మా అమ్మానాన్నా సైంటిస్టులేమోగానీ నెక్నంపూర్ చెరువు విషయంలో నేనే సైంటిస్టుగా మారాను. దాని మీద చేయని ప్రయోగం లేదు. ముందు నీటిని జలచరాలు బతికేందుకు అనువుగా చేయాలనుకున్నాం. అందుకోసం ఆ నీటిలో అధికంగా ఉండే సల్ఫర్, ఫాస్పరస్‌లాంటి వాటిని పీల్చుకుని నీటి మీద తేలుతూ బతికే మొక్కలను ఎంచి పెంచాం. దీన్నే ఫ్లోటింగ్ ట్రీట్మెంట్గా పిలుస్తాం. దాని తర్వాత నీటి కాలుష్యాన్ని తగ్గించే ఫైటో రెమిడియేషన్, బయో రెమిడియేషన్ అనే రెండు పద్ధతులను ఎంచుకున్నాం.
అంటే ప్రత్యేకమైన మొక్కలు, సూక్ష్మ జీవుల ద్వారా నీటిని శుద్ధిచేయడం. దాని తర్వాత నీటిలో ఆక్సిజన్ స్థాయుల్ని పెంచే ఫ్లోటింగ్ అరేటర్స్ అనే చిన్న యంత్రాలను పెట్టాం. అవి కూడా సూర్యరశ్మితో పనిచేస్తాయి. చెత్తను శుభ్రం చేసేందుకు స్వచ్ఛంద కార్యకర్తలతో కలిసి డ్రైవ్‌లను నిర్వహిస్తుంటాం. అలాగే గార్బేజ్ కలెక్షన్ బైక్‌లూ ఉన్నాయి. వీటన్నింటి ఫలితంగా నీరు స్వచ్ఛంగా తయారైంది. కొన్ని వేల చేపలు హాయిగా బతుకుతున్నాయి. 200కు పైగా పక్షి జాతులను ఈ చెరువు చుట్టూ చూడొచ్చు. మేం పెట్టిన ఫ్లోటింగ్ ట్రీట్మెంట్ దేశంలోనే పెద్దది . 2500 నుంచి 3500 చదరపు అడుగుల్లో ఉంటుంది. యూరోపియన్ వలస పక్షులు కూడా ఇక్కడ నివసిస్తుంటాయి.
ఎన్నో జాతులకు చెందిన తూనీగలు, సీతాకోక చిలుకలు, తాబేళ్లు, పాములు… ఇక్కడికి వచ్చి చేరాయి. ఈ చెరువు చుట్టూ లక్ష చెట్లు పెంచాం. చెరువుల పునరుద్ధరణకు ఇది మంచి మాడల్ అని ప్రశంసిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2019లో మా ఎన్జీఓకు వాటర్ అవార్డును ప్రదానం చేసింది. ఇప్పటికీ తెలంగాణలో ఆ అవార్డు వచ్చిన ఏకైన స్వచ్ఛంద సంస్థ ఇదొక్కటే. దానికి ముందు ఏడాది తెలంగాణ ప్రభుత్వం నుంచి హరిత మిత్ర అవార్డు అందుకున్నా. 2026లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి గవర్నర్ చేతుల మీదుగా మరో పురస్కారం లభించింది.
13 చెరువులు బాగుచేశాం..
నెక్నంపూర్ చెరువుకు 2023లో నీతి ఆయోగ్ గుర్తింపు కూడా వచ్చింది. అయితే ఈ చెరువును పునరుద్ధరించిన రీతిలోనే మరికొన్నింటినీ బాగుచేసే పని పెట్టుకున్నాం. కోకాపేటలోని కొత్త చెరువు, గచ్చిబౌలి బర్లకుంట చెరువు, షాద్‌నగర్ జానమ్మ చెరువు, నార్సింగిలోని ముష్కిన్ చెరువు… ఇలా మొత్తం 13 చెరువులు బాగుచేశాం. ఇప్పుడు వీటిలో ఒక నాలుగింటి మీద ఇంకా పనిచేస్తూనే ఉన్నాం. చెరువుల్లోని నీటితో పాటు అక్కడి వాతావరణంలో, జీవవైవిధ్యంలో వచ్చిన మార్పులు చూస్తే ఎంతో సంతృప్తి కలుగుతుంది. నా పిల్లలకు ఈ చెరువుల గట్ల మీద కూర్చోబెట్టే పాఠాలు చెప్పాను. బాబు జేఈఈ ర్యాంకు సాధించాడు. నాకు చెరువులోనే అన్ని సబ్జెక్టులూ ఉన్నాయనిపిస్తుంది.
ఒకదాన్ని చూపిస్తూ పాఠం చెప్పడం వల్ల పిల్లలు త్వరగా అర్థం చేసుకుంటారు. ఈ ప్రయాణంలో నాతో కలిసి మొక్కల కోసం పని చేసిన తొలి నలుగురు వ్యక్తుల జీవితాల్లోనూ ఎంతో మార్పు వచ్చింది. ఇప్పుడు వాళ్లు మద్యం తాగరు. వాళ్ల పిల్లలు కూడా తమతో పాటు పెరిగిన మొక్కల మీద, అక్కడి చెరువుల మీద ప్రేమను పెంచుకున్నారు. నేను కోరుకున్నదీ ఇదే. తర్వాతి తరంలో పర్యావరణం పట్ల ఏర్పడాల్సిన ప్రేమ. అది ఉన్న వాళ్ల చేతుల్లో భూమి చల్లగా ఉంటుంది. వీటన్నింటినీ గమనించినప్పుడు వచ్చే సంతృప్తిని నాకు ఏ అవార్డూ ఇవ్వలేదు. అయితే ఈ చెరువులను బాగు చేయడం అన్నది నిజంగా సాహసం. కొన్ని చోట్ల కబ్జాలకు ఒప్పుకోలేదని ప్రాణాలు తీస్తామని బెదిరించిన వాళ్లూ ఉన్నారు. నాలా కొందరు పోరాడితే కాదు, చెరువులు బాగుండాలంటే వాటి సంరక్షణకు చట్టం తీసుకురావాలి. ఒకసారి బాగు చేశాక… దాని నిర్వహణ బాధ్యత కూడా చూసుకోవాలి. అప్పుడే నీటి వనరులు కళకళలాడతాయి. నేల పచ్చగా ఉంటుంది.
– లక్ష్మీహరిత ఇంద్రగంటి
– గడసంతల శ్రీనివాస్
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

