డిక్షనరీలోకి ఏటా కొన్ని వందల కొత్త పదాలు వచ్చిచేరుతుంటాయి. అవన్నీ మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంటాయి. అయితే,ఈమధ్య జెన్-జీ వాడుతున్న కొన్ని మాటలు..వింతగా, విచిత్రంగా ఉంటున్నాయి. ముఖ్యంగా, ‘డేటింగ్’ ప్రపంచంలో అవన్నీ విరివిగా ప్రచారం అవుతున్నాయి. వినడానికి కొత్తగా ఉన్నా.. ఇవన్నీ ఒకవ్యక్తి ప్రవర్తనను, మానసిక స్థితిని ప్రతిబింబిస్తాయి.‘డేటింగ్’లో విహరించే నవతరానికి ఇలాంటి మాటల పట్ల అవగాహన ఉండటం చాలాముఖ్యం. లేకపోతే.. సోషల్ మీడియా,డేటింగ్ యాప్‌లలో నెట్టుకు రావడం కష్టం!
ఘోస్టింగ్
ఒక వ్యక్తితో అప్పటివరకూ మంచి రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తారు. ఎటువంటి కారణం లేకుండానే, అకస్మాత్తుగా ఆ బంధాన్ని నిలిపివేస్తారు. అన్ని రకాల కమ్యూనికేషన్స్ కట్ చేస్తారు. కాల్స్, మెసేజ్.. అన్నిటినీ బ్లాక్‌లో పెడతారు. దీనినే ‘ఘోస్టింగ్’ అంటున్నారు. ఒక దయ్యంలాగా, ఒక్కసారిగా కనిపించకుండా పోతారు కాబట్టే.. దీనికి ఆ పేరు.
సిట్యుయేషన్‌షిప్
మనకు ఫ్రెండ్షిప్ తెలుసు, రిలేషన్షిప్ తెలుసు. ఈ రెండిటి మధ్యలో ఉండే స్థితినే.. ‘సిట్యుయేషన్‌షిప్’ పేరుతో పిలుస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు ప్రేమికుల్లానే ఉంటారు. కానీ, వారి మధ్య ఎటువంటి కమిట్మెంట్ ఉండదు. అంటే.. ‘మేము ప్రేమికులం’ అని వారు ఎక్కడా చెప్పుకోరు. అలాగని.. కేవలం స్నేహితులుగానూ ఉండలేరు.
కుషనింగ్
ప్రస్తుతం ఒకరితో రిలేషన్‌షిప్‌ను కొనసాగిస్తుంటారు. ఒకవేళ అది విఫలమైతే.. తోడుగా ఉంటారు కదా అని మరికొందరిని ‘బ్యాకప్’ కింద పెట్టుకుంటారు. వారితోనూ ప్రేమగా సంభాషణలు సాగించడాన్నే.. ‘కుషనింగ్’ అంటారు. కింద పడితే దెబ్బతగలకుండా ‘కుషన్’ కాపాడుతుంది కదా! అలాగే, బ్రేకప్ బాధ తగలకుండా వేరే ఆప్షన్లను సిద్ధంగా ఉంచుకుంటారన్న మాట. ఇక రిలేషన్షిప్లో లేనప్పటికీ.. ఒక వ్యక్తిని బ్యాకప్ కింద పెట్టుకోవడాన్ని ‘బెంచింగ్’గా వ్యవహరిస్తున్నారు.

లవ్ బాంబింగ్
జెన్-జీ ఎక్కువగా ఫాలో అవుతున్న ట్రెండ్ ఇది. పరిచయమైన కొత్తలోనే ఒక వ్యక్తి మీద విపరీతమైన ప్రేమను, ఖరీదైన గిఫ్టులను, పొగడ్తలను కురిపించేస్తున్నారు. దీనికే ‘లవ్ బాంబింగ్’ అని పేరు. వినడానికి బాగున్నా.. నిజానికి అవతలి వ్యక్తిని తమ అదుపులోకి తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నమేనని ఈ ధోరణిని కొందరు విమర్శిస్తుంటారు.
జాంబీయింగ్
గతంలో ఎలాంటి కారణం లేకుండానే మాయమై ‘ఘోస్టింగ్’ చేసిన వ్యక్తి.. చాలాకాలం తర్వాత అకస్మాత్తుగా ప్రత్యక్షమవుతాడు. దాన్నే ‘జాంబీయింగ్’ అంటారు. అంటే, చనిపోయిన వారు ‘జాంబీ’లా తిరిగి వచ్చినట్లుగా.. వీరు మళ్లీ పలకరిస్తారు.