Dear Zindagi | నా స్నేహితురాలి తండ్రి ఈ మధ్యే మరణించారు. ఆ విషాదం నుంచి తనింకా కోలుకోలేదు. ఇదే అవకాశం అన్నట్టు బంధుమిత్రులు ఆమెకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. తన మీద పెత్తనం చెలాయించాలని చూస్తున్నారు. ఈ సమయంలో ఓ మిత్రురాలిగా నేనేం చేయగలను, ఎలా సాయపడగలను?
మీ ఆలోచన అర్థమైంది. స్నేహితురాలి పట్ల మీ నిబద్ధతకు అభినందించి తీరాల్సిందే. నిజమే. కుటుంబానికి పెద్ద దిక్కు అయిన తండ్రిని కోల్పోవడం ఏ కూతురి జీవితంలో అయినా విషాదమే. అందులోనూ ఆమె పేరిట ఆస్తిపాస్తులు ఉన్నాయని చెబుతున్నారు కాబట్టి, బెల్లం చుట్టూ ఈగల్లా బంధుగణం చేరిపోవడం సహజమే. ఎమోషన్స్‌ను అడ్డం పెట్టుకుని ఎంతోకొంత లాభపడే ప్రయత్నమూ జరుగుతుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడం స్నేహితురాలిగా మీ బాధ్యత. ఇలాంటి సమయాల్లో ఎవరైనా కొంత ఏకాంతాన్ని కోరుకుంటారు. ఇంటినిండా మనుషులు ఉన్నప్పుడు.. అసౌకర్యంగానూ ఉంటుంది. కాబట్టి, మీరు ఎక్కడున్నా, ఎంత దూరంలో ఉన్నా.. ‘నేనున్నా’ అనే భరోసా ఇవ్వగలిగితే చాలు.