వేసవిలో నేస్తం అంబలి. ఎండలు మండుతున్న వేళ ఓ గ్లాసెడు అంబలి తాగితే చాలు.. తాపమంతా హుష్‌కాకి. పల్లెల్లోనూ రైతులు పొద్దునే ఇంత అంబలి తాగి పొలం బాట పడుతుంటారు. అయితే, రానురాను అంబలి కుండలు మరుగునపడ్డాయి. అప్పటి అంబలే ‘జావ’, ‘మాల్ట్’ అంటూ కొత్త అవతారమెత్తి, ప్రజలకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నది.

ఎండలు మండి పోతున్నాయి. పొద్దుపొద్దున్నే కడుపులో ఏదైనా కాస్త చిక్కటి ద్రవాహారం పడితే, బ్రేక్‌ఫాస్ట్ కాస్త అటూ ఇటూ అయినా ఫర్వాలేదనిపిస్తుంది. అందుకే వాకింగ్, జిమ్, యోగా వంటివాటితో రోజును మొదలు పెట్టేవారంతా ఉదయాన్నే జావ తాగుతారు. ఇది శరీరానికి కావలసిన శక్తిని ఇవ్వడమే కాదు, జీవక్రియనూ సరిచేస్తుంది.
పుల్లటి అంబలికి కారం కారం ఆవకాయ ముక్క అదరగొట్టే కాంబినేషన్. కొందరు బెల్లం జోడించి తీపి అంబలి కూడా తయారుచేస్తారు. రాగిపిండితో చేసేటప్పుడు సాల్ట్‌కు బదులు బెల్లం ముక్కలు వేసి మరిగిస్తారు. వేడివేడిగా తాగితే బాగుంటుంది.

అంబలి తెలంగాణ ప్రత్యేక వంటకం. అంబలి కుండ, కూరాడు కుండ, కలికుండ .. ఇలా అంబలికోసం ప్రత్యేక వ్యవస్థ ఉండేది. అంబలి చేయాలంటే రాత్రే వేడినీళ్లతో పిండి తడపాలి. ఉదయాన్నే రోజూ ప్రత్యేకంగా అంబలి కోసం పోసి ఉంచే గంజికట్టు, బియ్యం కడిగిన నీళ్లను వంపి, పొయ్యిమీద పెట్టి ఎసరు రాగానే తడిపి పెట్టిన పిండి కలిపి బాగా మరిగించాలి. అంబలి మరుగుతుంటే పుల్లగా, కమ్మగా వచ్చే వాసన నోరూరిస్తుంది.
అంబలిని ఎక్కువగా జొన్నపిండితో చేస్తారు. కొందరు బియ్యపు పిండినీ వాడతారు. కొన్ని ప్రాంతాల్లో రాగిపిండికే ఓటేస్తారు. ప్రజలలో ఆరోగ్య స్పృహ పెరగడంతో సజ్జలు, అరికెలు, సామలు, ఊదలు వంటి తృణధాన్యాలతోనూ అంబలి కాస్తున్నారు.

అంబలి తయారీలో వాడే పిండిలోని కార్బొహైడ్రేట్స్ శరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయి. రాగుల్లో పుష్కలంగా ఉండే క్యాల్షియం, ఫైబర్, ఐరన్, ప్రొటీన్స్, మినరల్స్, అయోడిన్ శరీరానికి పోషకాలను ఇస్తాయి. మధుమేహంతో బాధ పడేవారు రోజూ అంబలిని తీసుకోవడం వల్ల చక్కెర స్థాయి అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతారు. ఆలస్యమెందుకు, అంబలికి జై కొట్టండి.
అంబలితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వుంటాయి. ఇది శరీరానికి రోజంతా శక్తినిస్తుంది. దీంట్లోని చలువ చేసే గుణం, ఒంటి ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. కాలేయంలోని అదనపు కొవ్వును నియంత్రిస్తుంది. రక్తహీనతను దారికి తెస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. అంబలిని తీసుకుంటే పోషకాహార సమస్యలనూ అధిగమించవచ్చు.