అత్యవసర పరిస్థితుల్లో మనిషికి రక్తం కావాలంటే బ్లడ్‌బ్యాంక్‌లు ఉన్నాయి. ఆత్మీయుల నుంచి కూడా రక్తదానం స్వీకరిస్తాం. అదే, మన పెంపుడు జంతువుకు రక్తం అవసరమైతే? నిజమే, ఇదో పెద్ద సమస్యే. కాబట్టే, కొన్ని స్వచ్ఛంద సంస్థలు ‘మీ పెంపుడు కుక్కలతోనూ రక్తదానం చేయించండి’ అని ప్రచారం చేస్తున్నాయి.
Petting Matters | రోడ్డు ప్రమాదాల్లో తీవ్ర గాయాలు. ఫుడ్ పాయిజనింగ్. రక్తహీనత. రక్త క్యాన్సర్.. ఇలాంటి అనేక సందర్భాల్లో పెంపుడు జంతువులకు, మరీ ముఖ్యంగా కుక్కలకు రక్తం అవసరం అవుతుంది. మనుషులకేముంది, బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. రక్త దాతలూ ఉన్నారు. ఎలాఅయినా సేకరిస్తారు. కానీ, శునకాల సంగతి? అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కడ దొరుకుతుంది, ఎవరిస్తారు. కొద్దిపాటి రక్తం అందకపోవడం వల్ల అనేక శునకాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ సమస్యను నివారించడానికి వివిధ సంస్థలు చొరవ చూపుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ‘పెటింగ్ మ్యాటర్స్’ అందులో ఒకటి.
మనుషుల్ని పోలినట్టే..
కుక్కల రక్తదానం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నది. కానీ, కుక్కల యజమానులు రక్తదానం విషయంలో వెనకడుగు వేస్తున్నారు. ఒకరిద్దరే, రక్తదానానికి సిద్ధపడుతున్నారు. కుక్కలకు పన్నెండు బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. డాగ్ ఎరిత్రోసైట్ యాంటీజెన్ (డీఈఏ)1.1 అనేది ఎక్కువగా ఉండే రక్తవర్గం. కాబట్టి తీసుకునే కుక్క రక్తం, ఎక్కించాల్సిన కుక్క రక్తం ఒక్కటి కావాలి. ఇప్పటివరకు కుక్కల కోసమే ప్రత్యేకించిన బ్లడ్ బ్యాంక్ ఎక్కడా లేదు. రక్తదానం తర్వాత కుక్కలు బలహీనతకు లోనవుతాయన్నది అపోహ మాత్రమే. ఇలాంటి అర్థంలేని ప్రచారాలు మనుషుల్లోనూ ఉన్నాయి. రక్తదానం సమయంలో కుక్కలకు కాస్తంత మత్తు ఇస్తారు. దీంతో కొంతసేపు ఆ మూగ జీవాలు అంత చురుగ్గా ఉండవు. దీన్నే యజమానులు బలహీనతగా పొరబడుతారు. ఆ ఇబ్బందిని నివారించడానికి ఓ టానిక్ ఇస్తారు. దీన్ని వాడితే కొద్దిరోజుల్లోనే రక్తం మామూలు స్థాయికి చేరుకుంటుంది. హుషారుగానూ ఉంటాయి.
స్వానుభవంతో..
ఏ సంక్షోభ సమయంలోనో కుక్కలకు రక్తం దొరకాలంటే కొంత కష్టమైన పనే. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రభుత్వేతర సంస్థలు పెంపుడు జంతువులు, వీధికుక్కల కోసం రక్తం సేకరించే కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ‘పెటింగ్ మ్యాటర్స్’ ్రఏర్పాటైంది. దీన్ని బాబీ చౌహాన్, శివాని ఓహోల్ అనే జంతు ప్రేమికులు స్థాపించారు. జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేయడం బాబీ అభిరుచి. పెంపుడు జంతువుల యజమానులు, వెటర్నరీ వైద్యులు, వలంటీర్లు, రక్తదానానికి ముందుకు వచ్చేవారితో ఏర్పాటైన సమూహమే.. పెటింగ్ మ్యాటర్స్. అలా ఈ సంస్థ జంతువులు- మనుషుల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని సృష్టిస్తున్నది. ఓసారి బాబీ పెంపుడు శునకమైన బడ్డీ జబ్బుపడింది. దానికి రక్తం అవసరమైంది.
రెండు రోజులైనా దొరకలేదు. ఇంతలో ఓ పశువైద్యుడి సహాయంతో ఎలాగోలా రక్తం ఎక్కించి బడ్డీ ప్రాణాలు కాపాడగలిగాడు. ఈ సంఘటనే బాబీతో పెటింగ్ మ్యాటర్స్ను స్థాపించేలా చేసింది. అయితే, మనుషులకు ఉన్నట్టు జంతువులకు బ్లడ్ బ్యాంకులు లేవు. కాబట్టి కుక్కలు, పిల్లులకు రక్తం అవసరమైతే నేరుగా ఎక్కించాల్సి వస్తుంది. ‘రక్తదానం చేసే కుక్కను పశువైద్యుడు క్షుణ్నంగా పరిశీలిస్తాడు. రక్తదానానికి తగినదే అని నిర్ణయిస్తే.. రక్తాన్ని సంచుల్లోకి నింపుతారు. లేదంటే పెద్ద సూదుల్లోకి ఎక్కిస్తారు.
ఆ వెంటనే ప్రాణాపాయ స్థితిలో ఉన్న కుక్కకు ఎక్కిస్తారు’ అని వివరిస్తారు శివాని ఓహోల్. గడచిన ఐదేండ్లలో హైదరాబాద్‌లో 200 రక్తదానాలు జరిగాయి. ఇప్పుడు 90 మంది యజమానులు రక్తదానానికి అంగీకరించారు. నగరంలో ఏడాది కాలంలో అవసరమయ్యే రక్తం సేకరించాలంటే ఈ సంఖ్య 150కి పెరగాల్సి ఉందంటారు శివాని. ఆ దిశగా పెటింగ్ మ్యాటర్స్ తీవ్రంగా కృషి చేస్తున్నది. అంతేకాదు, రక్తదానానికి యజమానులను ఒప్పించడానికి వారికి అవగాహన కల్పిస్తున్నది. వెటరినరీ క్లినిక్స్‌తో ఒప్పందాలు చేసుకుంటున్నది. రక్తదానం విషయంలో నెలకొన్న అపోహలను తొలగించడానికి ప్రయత్నిస్తున్నది. ఎవరైనా తమ కుక్కల రక్తాన్ని దానం ఇవ్వాలనుకునేవారు 73308 95424 నంబర్లో సంప్రదించవచ్చు.
ఎప్పుడు ఇవ్వాలి?
రక్తదానం చేసే పెంపుడు కుక్కలు అనారోగ్యంగా కానీ, బలహీనంగా కానీ ఉండకూడదు. అన్ని వ్యాక్సిన్లూ వేయించాలి. ఒకటి నుంచి ఆరేండ్ల వయసు ఉండాలి. 16 నుంచి 22 కిలోల బరువు తూగాలి. రక్త సంబంధ రుగ్మతలు ఉన్న శునకం దానానికి పనికిరాదు. గర్భిణిగా ఉన్నప్పుడు కూడా రక్తం తీసుకోరు. ఒకసారి రక్తం దానం చేస్తే మళ్లీ మూడు నెలల్లోపు ఇవ్వకూడదు. మానసిక స్థితి సరిగ్గా ఉండటం కూడా ప్రధానమే. పిల్లుల్లో అయితే… వాటి వయసు ఒకటి నుంచి ఐదేండ్ల మధ్య ఉండాలి. బరువు మూడు కిలోల కంటే ఎక్కువగా ఉండాలి.