నాకు బాల్యం నుంచీ స్వతంత్ర భావాలు ఎక్కువ. ఏ విషయంలోనూ మహిళ పురుషుడి కంటే తక్కువ కాదని, నచ్చినట్టు బతకాలని కోరుకుంటాను. నా ఆలోచనల్ని గౌరవిస్తానని మాటిచ్చిన తర్వాతే.. నా సహోద్యోగిని పెండ్లాడాను. ఇద్దరికీ ప్రయాణాలంటే ఇష్టం. ఇద్దరివీ మంచి ఉద్యోగాలే. కుటుంబాలకు దూరంగా.. మేం ఆనందంగా బతికేస్తున్నాం. ఈ మధ్య సొంతూరికి బదిలీ చేయించుకోమని మా అత్త్తామామలు పోరుతున్నారు. ‘ఏడాదికి ఒకసారి మాత్రమే సొంతూళ్లకు వెళ్లాలి. పిల్లల ఆలోచనే వద్దు’ అని పెండ్లికి ముందు చేసుకున్న ప్రమాణాలు మా ఆయనకు గుర్తుచేశాను. నా మాటల్ని తేలిగ్గా తీసుకున్నాడు. ‘వీటికి చట్టబద్ధత ఉండదు’ అంటూ ఎగతాళి చేస్తున్నాడు. తీవ్ర వంచనకు గురైన భావన కలుగుతున్నది. విడాకులు తీసుకునే ఆలోచన ఉంది. మీ సలహా?
– ఓ పాఠకురాలు
మీ భర్త పిల్లల్ని కోరుకోవడంలో ఎలాంటి తప్పూ లేదు. పిల్లలు వద్దనడానికి మీ వైపు నుంచి బలమైన కారణం ఉందా?.. అది ఆరోగ్యపరమైంది కావచ్చు, మానసికమైందీ కావచ్చు. మీదైన వాదనతో న్యాయస్థానాన్ని మెప్పించగలిగినప్పుడు మాత్రమే.. మీరు నెగ్గుతారు. వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు.. రెండు కుటుంబాల మధ్య జరుగుతుంది.. అనే మాట వినే ఉంటారు. కుటుంబాలను విస్మరించడం సరికాదు. నైతికత, అనైతికత.. అనే చర్చ పక్కన పెడితే పెండ్లికి ముందే.. మీ ఇద్దరూ కొన్ని షరతులకు అంగీకరిస్తూ.. ఓ లిఖితపూర్వకమైన ఒప్పందం చేసుకుని ఉంటే.. మీ వాదన కొంతమేర చెల్లుబాటు అయ్యేది. ఇప్పుడు ఆ అవకాశం లేదు.