Kanika Devan | క్రికెటర్లు, సినీతారలు, విశ్వ కుబేరులు స్వచ్ఛంద సంస్థలు నెలకొల్పడం విశేషమేమీ కాదు. వాటిని
సమర్థంగా నిర్వహించడమే వార్త. అలాంటి ఓ అరుదైన సంస్థ శిఖర్ ధవన్ ఫౌండేషన్. దానికి ఓ ముఖ్య కారణం ఆ సంస్థ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న కనిక దేవన్ అంతులేని నిబద్ధత. అందుకే కనికకు ‘ఫ్యూచర్ మాస్టర్’ అవార్డు దక్కింది. తను స్వతహాగా ఇంటీరియర్ డిజైనర్. కోల్‌కతాలో పుట్టారు. ఇంగ్లండ్‌లో చదివారు.
స్వచ్ఛంద సేవ అంటే చిన్నపాటి సాయాలు కాదనీ, సమాజంలో సమూలమైన మార్పు కోసం చిత్తశుద్ధితో కూడిన ప్రయత్నమనీ అంటారు కనిక. పెరిగిన వాతావరణం, ఉన్న పరిస్థితులతో సంబంధం లేకుండా ఎవరైనా మెరుగైన జీవితానికి అర్హులే, అందుకు తగినంత చేయూత అందించాలని చెబుతారు.
ఈ కొత్త సంవత్సరంలో కనికకు కూడా కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. అవి వ్యక్తిగతమైనవి కాదు! సమాజానికి మరింత సేవ చేయాలనీ, ఫౌండేషన్ తరఫున ఇంకొన్ని జీవితాల్లో వెలుగులు నింపాలని లక్ష్యం. అవిద్య, ఆకలి, నిరక్షరాస్యత లాంటి సమస్యల మీద పోరాడుతూ… మహిళా సాధికారత దిశగా సాగడమే తన ధ్యేయం అంటున్నారు.