గాయని అల్కాకు అరుదైన సమస్య
ఎన్నో స్వరాలకు తన గళాన్ని మేళవించి మనకు మనోహరమైన పాటలను అందించిన గాయని ఆమె. ‘కహో నా ప్యార్ హై..’ అని ఎలిగెత్తి పాడితే& ‘హాఁ తుమ్ సే ప్యార్ హై..’ అని ఎందరో ఆమె గాత్రం ప్రేమలో పడిపోయారు. ‘తాళ్ సే తాళ్ మిలా..’ అన్నప్పుడు ‘ఆజా సాఁవరియా..’ అని శ్రోతలు ఆస్వాదించారు.
బాలీవుడ్ సింగర్ అల్కా యాజ్ఞిక్ ఓ నోస్టాలజీ మాయ. ఆమె పాటంటే అందరూ చెవి కోసుకుంటారు. కానీ, తన పాటే తను వినలేని పరిస్థితి ఆమెకు ఎదురైంది. తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన పాటలు ఆలపించి వీనుల విందు చేసిన అల్కా కొన్నాళ్లుగా తాను వినికిడి లోపంతో బాధపడుతున్నట్టు ఇన్స్టాగ్రామ్ వేదికగా పేర్కొన్నది. జూన్ 17న పెట్టిన ఈ పోస్టులో న్యూరల్ నర్వ్ సెన్సరీ లాస్ వల్ల తనకు ఈ అరుదైన సమస్య వచ్చినట్టు ఆమె రాసుకొచ్చింది.
ఇంకా ‘నా అభిమానులు, స్నేహితులు, అనుచరులు, శ్రేయోభిలాషులు అందరూ ఈ పరిస్థితుల్లో అండగా నిలవాలి’ అని ఆమె విజ్ఞప్తిచేసింది. రెండున్నర నెలల కిందట అల్కా ముంబయి నుంచి గోవాకు విమానంలో ప్రయాణించింది. అప్పుడు విమానం దిగుతున్న సమయంలో తనకు ఏదీ వినబడటం లేదని గ్రహించింది. మరుసటి రోజు డాక్టర్ను సంప్రదించగా అల్కాకు వినికిడికి సంబంధించిన నాడుల సమస్య ఉన్నట్టు నిర్ధారణ అయింది.
వైరస్ దాడి కారణంగా ఇలా జరిగిందని ఆమె తన పోస్టులో వెల్లడించింది. దీంతో ఆమె తన సంగీత కార్యక్రమాలను కొంతకాలంపాటు వాయిదా వేసుకున్నది. ఇకపోతే, ఎక్కువ ధ్వనితోగానీ, చెవులకు హెడ్ఫోన్స్ పెట్టుకొని గానీ సంగీతం వినకూడదని 58 ఏండ్ల అల్కా తన అభిమానులతోపాటు అందరికీ సలహా ఇచ్చింది. దీనివల్ల తన వృత్తి జీవితానికి జరిగిన ఆరోగ్య సంబంధమైన నష్టాల వివరాలను మళ్లీ ఎప్పుడైనా అభిమానులతో పంచుకుంటానని పేర్కొంది. వినికిడి లోపం తలెత్తిన క్లిష్ట సమయంలో తన పరిస్థితిని అర్థం చేసుకుని తనకు అండగా నిలవాలని అల్కా తన అభిమానులను కోరింది