శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Komarambheem - Jan 29, 2020 , 03:28:42

మత్స్యకారులకు మంచి రోజులు

మత్స్యకారులకు మంచి రోజులు

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలో గత ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యానికి గురైన మత్స్యకార కుటుంబాలకు ప్రస్తుత సర్కారు అండగా నిలుస్తోంది. వారి జీవితాలకు బతుకు భరోసా కల్పించేందుకు భారీగా నిధులు మంజూరు చేయడంతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తోంది. చేపల వేటనే జీవనాధారంగా బతుకుతున్న వారి జీవితాల్లో ప్రభుత్వం సరికొత్త వెలుగులు నింపుతోంది. ఆధునిక పద్ధతుల్లో చేపల వేట, మార్కెటింగ్‌ సౌకర్యం, చేప విత్తనాల ఉత్పత్తి వంటి ప్రక్రియల్లో వీరిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సమగ్ర మత్స్య అభివృద్ధి పథకం ప్రవేశ పెట్టింది. దీని ద్వారా జిల్లాలో రూ. 2. 50 కోట్లతో 390 మంది మత్స్యకారులకు మోపెడ్లను అందించింది. ఇటీవల గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మరికొందరికి ఈ మోపెడ్లను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు, ఎమ్మెల్యే ఆత్రం సక్కు అందజేశారు.

మత్స్యకారులకు ఉపాధి...

ప్రభుత్వం మత్స్యశాఖ తరపున మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపడుతోంది. సమీప జలవనరులు, చెరువుల్లో చేప పిల్లలను పెంచుతూ మత్స్య సంపదను వృద్ధి చేసేందుకు కృషి చేస్తోంది. ప్రభుత్వ పథకాలు మత్స్యకార్మికులకు పారదర్శకంగా చేరేందుకు ప్రభుత్వం మత్స్యశాఖ సొసైటీల వివరాలను కూడా ఆన్‌లైన్‌ చేసింది. జిల్లాలో 19  సంఘాలుండగా, వారికి ఒక మొబైల్‌ అవుట్‌లెట్‌, 100 సభ్యులు కలిగిన ఒక సంఘానికి 75 శాతం సబ్సిడీతో ఆటో లగేజి వాహనాలు, వందమందికి పైగా సభ్యులున్న సంఘానికి ఒక ట్రక్కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు సొసైటీలో సభ్యత్వం ఉన్న ప్రతి కుటుంబానికి మోపెడ్‌ వాహనం ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా 390 మోపెడ్‌ వాహనాలను అందించింది. వాహనంతోపాటు ఐస్‌బాక్స్‌లు, కాంటాలను కూడా అందజేసింది. దీనికోసం ప్రభుత్వం ఒక్కొక్క వాహనంపై రూ. 38,640 ప్రభుత్వం చెల్లించింది. దీంతోపాటు  ఒక్కొక్కరికీ రూ. 15 లక్షల బీమా కూడా చేయించింది. రూ. 5లక్షల విలువచేసే 7 లగేజి అటోలు అందిచారు. త్వరలోనే మరో 10 ఆటోలను అందించనున్నారు. త్వరలోనే రూ.10 లక్షల విలువచేసే 5 ట్రాన్స్‌పోర్టు వాహనాలు, 50 మందికి వలలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

వందలాది కుటుంబాలకు ప్రయోజనం

జాతీయ సహకార అభివృద్ధి కౌన్సిల్‌ (నేషనల్‌ కో ఆపరేటివ్‌ డెవలప్‌మెంటు కార్పొరేషన్‌/ఎన్‌సీడీసీ)కి వ్యక్తిగత పూచికత్తు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఇంటిగ్రేటెడ్‌ ఫిషరీస్‌ డెవలప్‌మెంటు (ఐఎఫ్‌డీఎస్‌/సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద జిల్లాకు రూ. 25 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. చేపల ఉత్పత్తి, చెరువుల్లో వదిలిన చేప విత్తనం పెరిగిన తరువాత వాటిని పట్టుకునేందుకు కావాల్సిన మెటీరియల్‌, పట్టిన చేపలను నిలువ చేసుకునేందుకు కోల్డ్‌ స్టోరేజ్‌లు, చేపలను ఎగుమతి చేయడానికి కావాల్సిన కాంపోనెంట్స్‌, మార్కెటింగ్‌కు అవసరమైన చేపల వేట పరికరాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ఈ నిధులు వెచ్చిస్తున్నారు. కింద 2017 -18, 2018-19 సంవత్సరాలకు జిల్లాకు రూ. 25 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం కేటాయించింది. దీంతో మత్స్య పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన వందలాది కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతోంది. మత్స్యకారులకు ఉపాధిని కల్పించేందుకు 2019-20 సంవత్సరంలో వంద శాతం సబ్సీడీపై రూ.కోటీ 7లక్షలతో 233 చెరువుల్లో రూ. 57 లక్షలతో 13 రిజర్వాయర్లలో 65 లక్షల చేపపిల్లలను ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో వేసింది. మత్స్యకారులు చేపలను పట్టుకునేందుకు వసతులు కల్పించడంతోపాటు వాటిని మార్కెట్‌కు తరలించి అమ్ముకునే విధంగా వాహనాలను సమకూర్చడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉపాధి పొందుతున్నారు.


logo