శనివారం 28 మార్చి 2020
Komarambheem - Jan 18, 2020 , 01:19:07

ప్రచారం ముమ్మరం

ప్రచారం ముమ్మరం
  • -వార్డుల్లో కలియదిరుగుతున్న ఎమ్మెల్యే, అభ్యర్థులు
  • -అభివృద్ధి ఎజెండాగా ప్రజల్లోకి..
  • -అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్న జనం
  • -టీఆర్‌ఎస్‌ పార్టీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి: ఎమ్మెల్యే కోనప్ప


కుమ్రం భీం ఆసిఫాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ కాగజ్‌నగర్‌ టౌన్‌ : కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రచారానికి కేవలం మూడు రోజులే సమయం ఉండడంతో అభ్యర్థులు వార్డుల్లో కలియదిరుగుతున్నారు. ముఖ్యంగా మహిళా సంఘాల సభ్యులు, కుల సంఘాల నేతలతో  సమావేశాలు నిర్వహిస్తూ వారిని ప్రసన్నం చేసుకుంటున్నారు. కులాలవారీగా కుల సంఘం ఓట్ల కోసం పథక రచన చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో మహిళా సంఘాల ఓట్లు కీలకం కానున్న నేపథ్యంలో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే వారిని కలిసిన అభ్యర్థులు ఆయా మహిళా సంఘాలకు ఏమేం చేస్తామో చెబుతున్నారు. అదే సమయంలో కుల సంఘాల ఓట్లు కూడా కీలకంగానే ఉంటాయి. దీనిని కూడా అభ్యర్థులు వదులుకోవడం లేదు. కుల పెద్దలను కలిసి ఆ కుల సంఘానికి ఏం చేయాలి? ఏం చేస్తామనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఈ ఓట్లను ప్రసన్నం చేసుకుంటే తమ గెలుపు సగం ఖాయం అనే ఆలోచనలో అభ్యర్థులు ఉన్నారు.

అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యే..

మరోవైపు ఎమ్మెల్యే కోనప్ప అభ్యర్థులతో పాటు ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్షాలు గతంలో మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ఏ మాత్రం చేయకుండా ఇప్పుడు ఓట్లు అడిగేందుకు వస్తున్నాయంటూ దుయ్యబడుతున్నారు. అదే సమయంలో టీఆర్‌ఎస్‌ చేసిన అభివృద్ధి చూపిస్తూ  ప్రచారంలో అందరినీ ఆకట్టుకుంటున్నారు. స్థానిక సమస్యలు ప్రస్తావిస్తూ టీఆర్‌ఎస్‌ను మరోసారి గెలిపిస్తే మున్సిపాలిటీని మరింత అభివృద్ధి బాటలో నడిపిస్తామని హామీ ఇసున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలో ప్రజలకు జరిగిన మేలును వివరిస్తున్నారు.

స్థానిక సమస్యలపై దృష్టి..

ప్రస్తుత ఎన్నికల్లో స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన అభ్యర్థులు వాటినే ప్రధాన అస్త్రంగా చేసుకుని ముందుకు సాగుతున్నారు. తాగునీరు, డ్రైనేజీ తదితర వ్యవస్థల విషయంలో ప్రధాన ప్రచారం సాగిస్తున్నారు. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఇప్పటికీ నానా ఇబ్బందులు పడుతున్నామని గెలిస్తే ఖచ్చితంగా మెరుగుపరుస్తామని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన పథకాలు దాని వల్ల వారికి జరిగిన మేలు గురించి వివరిస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని కూడా అదే స్థాయిలో తిప్పికొడుతున్నారు. వార్డుల్లో ఇంటింటికీ అందరినీ కలిసేలా ప్రణాళికలు రూపొందించుకుని మరీ ముందుకు సాగుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. వీలైనన్ని ఎక్కువ ఓట్లు రాబట్టేలా వ్యూహాలు రచిస్తున్నారు.

కనిపించని ‘సోషల్‌ మీడియా’ సందేశాలు

పల్లె ఎన్నికల ప్రచారంలో సామాజిక మాధ్యమాలు కూడా వేదికగా మారాయి. ఏడాది నుంచి జరుగుతున్న ఎన్నికల్లో సోషల్‌ మీడియా ప్రభావం మరచిపోలేనిది. కానీ, మున్సిపల్‌ ఎన్నికల్లో  సోషల్‌ మీడియా ప్రభావం పెద్దగా లేదు. భైంసా అల్లర్ల నేపథ్యంలో నాలుగు రోజులుగా ఇంటర్‌నెట్‌ సేవలు నిలిపివేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వ్యాప్తంగా కూడా ఇంటర్‌నెట్‌ సేవలు బంద్‌ చేశారు. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా అభ్యర్థుల ప్రచారం జోరు లేకుండాపోయింది. లేకపోతే అభ్యర్థులు వాట్సాప్‌ను విస్తృతంగా ఉపయోగించి ముందుకు సాగేవారు. ఇందుకోసం స్థానికంగా కొంతమేర అవగాహన ఉన్న వారిని ఎంపిక చేసుకుని, వారి ద్వారా తాము ప్రచారం చేస్తున్న తీరుతెన్నులు సమస్యలు ఇలా అన్ని రకాలుగా ప్రచారం సాగించేవారు. కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమాలు లేకుండానే ప్రచారం సాగుతోంది.logo