కొత్తగూడెం సింగరేణి/ రుద్రంపూర్/ ఇల్లెందు/ మణుగూరు టౌన్, మార్చి 30: సింగరేణి పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన సింగరేణి హెడ్డాఫీసు ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కోల్‌బెల్ట్ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాదిమంది కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించి హెడ్డాఫీసు ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు, నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
నాయకులను పోలీసులు అరెస్టు చేసి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తొలుత, ధర్నా వద్ద కార్మికులను ఉద్దేశించి సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.50 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి ఆ బకాయిలు ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏసీబీ విచారణ సాకుతో మెడికల్ బోర్డును నిలిపివేయడమంటే కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడడమేనని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి సిరిని దోచుకుంటున్నాయని ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ, ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
సింగరేణి యాజమాన్యం, కాంగ్రెస్ ప్రభుత్వం.. కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని టీబీజీకేఎస్ ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ డిమాండ్ చేశారు. సింగరేణి పరిరక్షణ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సంస్థ కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయం ఎదుట టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు కృష్ణ మాట్లాడుతూ.. ఏడాదికాలంగా మెడికల్ బోర్డు కోసం ఎదురుచూస్తున్న కార్మికులకు న్యాయం చేయాలని, వెంటనే మెడికల్ బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం, జీఎం షాలెంరాజుకు వినతిపత్రం అందించారు. సంఘం నాయకులు పాల్గొన్నారు.
ప్రతి నెలా రెండు మెడికల్ బోర్డులను నిరంతరాయంగా నిర్వహించాలని టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు అబ్దుల్ జఫర్ హుస్సేన్ డిమాండ్ చేశారు. సింగరేణి పరిరక్షణలో భాగంగా సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు టీబీజీకేఎస్ నాయకులు సోమవారం ఇల్లెందు ఏరియా జీఎం కార్యాలయం ఎదుట నిరసన తెలిపి జీఎం కృష్ణయ్యకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు.