– గర్భిణీలు, చిన్నారులకు పోషకాహారంపై అవగాహన
కామేపల్లి, అక్టోబర్ 08 : కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామ పంచాయతీ పరిధిలో పోషణ మాసం ముగింపు కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామేపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టు సీడీపీఓ ఉమా ముఖ్య అతిథిగా హాజరై పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో లభించే అధిక పోషక విలువలు కలిగిన ఆహారాన్ని రోజువారీగా తీసుకోవాలని సూచించారు. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలని, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు సమతుల్య ఆహారం తీసుకోవాలని తెలిపారు. పోషణ మాసం సందర్భంగా నెల రోజుల పాటు అంగన్వాడీ కేంద్రాల పరిధిలో వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు.
స్థానిక సర్పంచ్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను అర్హులు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు. బ్లాక్ కో ఆర్డినేటర్ రమేశ్ మాట్లాడుతూ.. ‘మన అంగన్వాడీ–మన బాధ్యత’ భావనతో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన, గర్భిణీలకు సీమంతాలు నిర్వహించి పోషణ మాసం ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, సెక్టర్ సూపర్వైజర్ బి.వరలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

గోవింద్రాలలో ఘనంగా పోషణ మాసం ముగింపు వేడుకలు