కారేపల్లి/కామేపల్లి, అక్టోబర్ 2 : మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఖమ్మం జిల్లా కారేపల్లి, కామేపల్లి మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్, గ్రామపంచాయతీ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కార్యాలయాలు, విద్యాసంస్థల ప్రాంగణాల్లో గాంధీజీ చిత్రపటాలను ఏర్పాటు చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా గాంధీజీ జీవిత విశేషాలు, స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన పోషించిన కీలక పాత్రను అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. సత్యం,అహింస,శాంతి, స్వచ్ఛత వంటి గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని వారు సూచించారు.
విద్యాసంస్థల్లో విద్యార్థులకు గాంధీజీ సిద్ధాంతాలపై ప్రసంగాలు, వ్యాసరచన,చిత్రలేఖనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు గాంధీజీ జీవితానికి సంబంధించిన విషయాలను ప్రసంగాల ద్వారా వివరించారు.కొన్ని సంస్థల్లో స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం గాంధీజీ చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని ఈ సందర్భంగా పలువురు పేర్కొన్నారు.