మాఫీ.. మాకు రాలేదే !
రుణమాఫీ మాకు రాలేదంటే.. మాకు రాలేదంటూ ఎంతోమంది రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం విడుదలైన రూ.లక్షలోపు రుణమాఫీ జాబితాలో తమకు మొండి‘చేయి’ చూపడంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- ప్రతి రైతు నోటా.. ఇదే మాట
- ‘రుణమాఫీ’లో తమ పేర్లు లేవంటూ అన్నదాతల ఆవేదన
- బ్యాంకులు, సొసైటీల వద్దకు పరుగులు
- పొంతనలేని సమాధానాలు చెబుతున్న అధికారులు
- డీసీసీబీలో పావువంతు మందికే మాఫీ వర్తింపు
- ‘పహాణీ’పై తీసుకున్న రైతులకు మొండి‘చేయి’
- రూ.లక్షలోపే ఇంత కోత.. రూ.2 లక్షల్లో ఎంత వడపోతో..
- ఆందోళన చెందుతున్న లబ్ధిదారులు
రుణమాఫీ మాకు రాలేదంటే.. మాకు రాలేదంటూ ఎంతోమంది రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం విడుదలైన రూ.లక్షలోపు రుణమాఫీ జాబితాలో తమకు మొండి‘చేయి’ చూపడంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం కొండంత ఆశతో బ్యాంకులు, సహకార సొసైటీల వద్దకు పరుగులు తీసిన అన్నదాతలు తమకు రుణమాఫీ కాలేదని తెలుసుకొని నిరాశతో వెనుదిరిగారు. బ్యాంకు అధికారులు చెప్పిన పొంతనలేని సమాధానాలు విని విస్తుపోయారు. రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేయడంలోనే ఇంతమందిని కోత పెడితే.. ఇక రూ.2 లక్షల్లో ఎంతమందిని వడపోస్తారోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
-ఖమ్మం, జూలై 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ ఖమ్మం జిల్లావ్యాప్తంగా వేలాది మంది రైతులకు అనేక తిప్పలు తెచ్చిపెట్టింది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా రూ.లక్ష లోపు పంట రుణాల మాఫీకి సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైన సంగతి విదితమే. దీనికి ఒకరోజు ముందుగానే లబ్ధిదారుల జాబితాను సైతం ప్రభుత్వం విడుదల చేసింది. రుణమాఫీ సందర్భంగా సాయంత్రం రైతు వేదికల్లో కాంగ్రెస్ నాయకులు, అధికారులు రుణమాఫీ సంబురాల పేరుతో హంగామా కూడా చేశారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అసలు రుణమాఫీకి అర్హత కలిగిన రైతులు ఎవరు? జాబితాలో పేరులేని రైతులు ఎవరిని సంప్రదించాలి? అనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయకపోవడంతో రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం భారీ వర్షం కురుస్తున్నప్పటికీ బ్యాంకులు, సొసైటీ కార్యాలయాల చుట్టూ రైతులు తమ రుణమాఫీ వివరాలు తెలుసుకునేందుకు ప్రదక్షిణలు చేశారు.
ఉదయం 10 గంటలకే ఆయా గ్రామాల రైతులు కార్యాలయాలకు చేరుకొని జాబితాలో తమ పేర్లు ఎందుకు రాలేదని అధికారులను వివరణ కోరగా.. ఒక్కొక్కరు ఒక్కో రీతిన సమాధానాలు చెప్పడం గమనార్హం. జాబితాలో పేరు ఉంటే ఉన్నట్లు లేకపోతే మేం ఏమి చేయలేమని పేర్కొనడం విశేషం. మరికొందరు బ్యాంకు మేనేజర్లు క్రమపద్ధతిలో జాబితా వస్తుందని దాటవేత ప్రయత్నం చేశారు. జాబితాలో పేర్లు ఉన్నవారి కంటే.. లేనివారే అధికంగా ఉన్నట్లు ఆరా తీశారు. రెండు బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నందున వారి పేర్లు జాబితాలో లేవని అధికారులు వివరణ ఇచ్చారు. రేషన్‌కార్డులో ఇద్దరి పేర్లు ఉంటే కూడా రుణమాఫీ రాలేదని మరికొందరు రైతులు వాపోయారు. దీంతో జిల్లావ్యాప్తంగా 76 సొసైటీలు, మరో 30 సహకార బ్యాంకులకు తోడు, ఇతర వాణిజ్య, ప్రైవేట్ బ్యాంకుల్లో సైతం ఇదే పరిస్థితి కనిపించింది.
డీసీసీబీలో పావువంతు రైతులకే..
రైతులకు పంట రుణాలు ఎక్కువగా ఇచ్చే బ్యాంకు కేవలం జిల్లా సహకార బ్యాంకు మాత్రమే అని చెప్పొచ్చు. రుణమాఫీ జరిగిన ప్రతిసారి ఉమ్మడి జిల్లాలో కనీసం 40 శాతం మంది రైతులు డీసీసీబీ, సహకార సంఘాలకు చెందిన వారే ఉండేవారు. ఈ సంవత్సరం కూడా రుణాలు పొందిన జాబితాలో ఖమ్మం డీసీసీబీ ఖాతాదారులే ఎక్కువ మంది ఉన్నారు. ప్రస్తుతం ఖమ్మం డీసీసీబీ నాలుగు జిల్లాల్లో 50 బ్రాంచీలు, మరో 100 ప్రాథమిక సహకార సంఘాలతో కలిగి ఉంది. సంబంధిత అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పంట రుణాలు తీసుకున్న రైతులు 1,69,864 మంది ఉన్నారు.
పంట రుణమాఫీకి సంబంధించి రూ.908.27 కోట్లు రావాల్సి ఉంది. జిల్లాల వారీగా పరిశీలిస్తే ఖమ్మం జిల్లాలో 1,16,291 మందికి రూ.647.76 కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 47,003 మందికి రూ.235.23 కోట్లు, ములుగు జిల్లాలో 1,375 మందికి రూ.6.50 కోట్లు, మహబూబాబాద్ జిల్లాలో 5,195 మంది రైతులకు రూ.18.33 కోట్లు రావాల్సి ఉంటుంది. తొలివిడతకు సంబంధించి రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకున్న రైతులు 1,43,327 మంది కాగా, వారికి రూ.526 కోట్లను ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. అయితే గురువారం రాత్రి విడుదలైన నిధులను పరిశీలిస్తే లక్షలోపు పంట రుణాలు తీసుకున్న కేవలం 37,625 మంది రైతులకు రూ.121.63 కోట్లను మాత్రమే విడుదల చేశారు. అంటే కనీసం పావుశాతం మంది రైతులకు మాత్రమే నేటివరకు రుణమాఫీ వర్తించినైట్లెంది.
రైతువేదికల్లో లబ్ధిదారుల వివరాలు
– సందేహాల నివృత్తికి ‘టోల్ ఫ్రీ’
రైతు రుణమాఫీ జాబితాను ఆయా రైతువేదికల్లో ప్రదర్శించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.విజయనిర్మల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకున్న రైతులు జిల్లావ్యాప్తంగా 57,857 మంది ఉన్నారన్నారు. రుణమాఫీకి సంబంధించిన ఎలాంటి సందేహాలనైనా తీర్చడానికి వ్యవసాయ శాఖ సిద్ధంగా ఉందన్నారు. రైతులు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు గ్రామస్థాయిలో జాబితాను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ఇతర సందేహాలకు స్థానిక ఏఈవోలను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. మండల, జిల్లాస్థాయిలో సైతం పరిష్కార విభాగాలు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం మూడంచెలుగా పరిష్కార వేదికలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ 1950 లేదా సెల్‌నెంబర్ 9063211298 ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించాలని రైతులకు సూచించారు.
వడ్డీతో సహా కట్టాలంటున్నారు..
నాకు రెండెకరాల పొలం ఉంది. 2019 జనవరి 2న మా గ్రామంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో రూ.45 వేల పంట రుణం తీసుకున్నాను. ఈ ఏడాది కాలం కలిసిరాక పంటలు పండలేదు. దీంతో అప్పు చెల్లించలేకపోయాను. అది వడ్డీతో కలిపి రూ.76 వేలు అయింది. రూ.2 లక్షల్లోపున్న పంట రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నిన్న (గురువారం) రూ.లక్షలోపున్న రుణాలను మాఫీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. నా పంట రుణాన్ని కూడా మాఫీ చేసిందనే అనుకున్నాను.
శుక్రవారం ఉదయం బ్యాంకుకు వెళ్లి అక్కడి అధికారులను అడిగాను. నా పంట రుణం మాఫీ కాలేదని వాళ్లు చెప్పేసరికి నాకు గుండె జారినంత పనైంది. ఇప్పటికే నా రుణం డీఫాల్ట్ అయిందని చెప్పారు. రుణమాఫీ కూడా కాలేదని చెప్పారు. ఇప్పుడు వడ్డీతో కలిపి మొత్తం రుణాన్ని చెల్లించాలని స్పష్టం చేశారు. చెల్లించకుంటే ఎలాగైనా రికవరీకి ఆదేశిస్తామని చెప్పారు. కొన్నాళ్లుగా నా ఖాతాను కూడా హోల్డ్‌లో పెట్టారు. అంతకుమునుపట రైతుబంధును కూడా బ్యాంకు అధికారులు తీసుకోనివ్వలేదు. రూ.2 లక్షల్లోపున్న పంట రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు నా పంట రుణాన్ని మాఫీ చేయలేదు.
-పాకనాటి శ్రీనివాస్‌రెడ్డి, రైతు, వల్లభి, ముదిగొండ మండలం
వివరాలు ఎవరూ చెప్పట్లే..
నాకు, నా భార్య పేరుమీద అన్నపురెడ్డిపల్లి ఏపీజీవీబీలో రూ.96 వేల రుణం ఉంది. రుణమాఫీ జాబితాలో నా భార్య పేరు వచ్చింది. మా ఇద్దరి పేరున రూ.లక్షలోపు మాత్రమే రుణం ఉంది. దీనిపై ఎవరిని అడిగినా వివరాలు చెప్పట్లేదు. బ్యాంక్‌కు వెళ్లి అడిగితే.. నా భార్య ఖాతాలో, నా ఖాతాలో నగదు జమ కాలేదని చెప్పారు. రూ.లక్షలోపు రుణం ఉన్న ప్రతి ఒక్కరికి మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. నా రుణం మాఫీ అవుతుందా? లేదా? అనేది అర్థం కావడం లేదు.
-మాయర శ్రీను, రైతు, రామకృష్ణాపురం,
అన్నపురెడ్డిపల్లి మండలంమా అమ్మ రుణం మాఫీ కాలేదు..
మా ఇంట్లో మొత్తం ముగ్గురం పంట రుణాలు తీసుకున్నాం. నాకు, మా తమ్ముడికి, మా అమ్మకు వేర్వేరుగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. మేం ముగ్గురమూ ఒకే రోజు సొసైటీలో పంట రుణాలు తీసుకున్నాం. అందరివి కలిపినా రూ.లక్షలోపు పంట రుణాలే. ఈ రుణమాఫీ జాబితాలో నా పేరు, మా తమ్ముడి పేరు వచ్చింది. కానీ మా అమ్మ పేరు రాలేదు. ఆమెకు రుణమాఫీ కాలేదు. మా అమ్మ పేరు మీద ఉన్న అర ఎకరం సాగు భూమిపై 2023 అక్టోబర్‌లో రూ.26 వేల పంట రుణం తీసుకున్నాం. మా అమ్మ పేరు రాలేదని సొసైటీలో అడిగితే.. కలెక్టర్ ఆఫీసుకు వెళ్లి కనుక్కోమని చెబున్నారు. మాలాంటి వారు ఎన్ని చోట్లకని వెళ్లాలి?
-చల్లా నర్సింహారావు, దివ్యాంగ రైతు, తనగంపాడు, ఖమ్మం రూరల్
రైతుల సందేహాలను ఎలా నివృత్తి చేయలో తెలియడం లేదు..
రుణమాఫీ ఎందుకు రాలేదని రైతులు అడుతుంటే సరైన సమాధానం మా దగ్గర ఉండడం లేదు. వారి సందేహాలను ఎలా నివృత్తి చేయాలో తెలియడం లేదు. జాబితాలో పేరు ఉంటేనే రుణమాఫీ అవుతున్నట్లు అని చెబుతున్నాం. రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకున్నవారిలో చాలామంది రైతుల పేర్లు జాబితాలో లేవు. దీంతో వారంతా వచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు. పంట రుణాలు తీసుకున్న రైతులందరి రుణాలనూ ప్రభుత్వం మాఫీ చేస్తే బాగుంటుంది. మా సొసైటీలో రూ.13 కోట్ల రుణాలకు గాను తొలివిడతలో కేవలం రూ.2 కోట్లను మాత్రమే ప్రభుత్వం విడుదల చేసింది.
-జర్పుల లక్ష్మణ్‌నాయక్, సొసైటీ చైర్మన్, ఏదులాపురం
రూ.11 వేల రుణమాఫీ కాలేదు..
నాకు క్రాప్‌లోన్ రూ.11,400 బేతంపూడి సొసైటీలో ఉంది. ప్రభుత్వం చెప్పినట్లుగా రుణమాఫీ కాలేదు. గతంలో ఒక్కసారి మాత్రమే రుణమాఫీ వచ్చింది. తర్వాత ప్రతి ఏటా వడ్డీ కడుతున్నా. ప్రస్తుతం సొసైటీలో సభ్యుడిగా ఉన్నా.. జాబితాలో నా పేరు లేదు. నాకు న్యాయం చేయండి సారూ..
-మాలోతు లాక్య. రైతు, ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు గ్రామం, టేకులపల్లి మండలం
బ్యాంకోళ్లు సమాధానం చెప్పట్లేదు..
నేను టేకులపల్లి ఎస్బీఐలో రూ.61 వేల వ్యవసాయ రుణం తీసుకున్నా. కానీ.. నిన్న ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో నా పేరు లేకపోవడం ఆందోళనగా ఉంది. దీని గురించి బ్యాంకుకు వెళ్లి అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదు. ఇప్పుడు దీని గురించి ఎవరిని అడగాలో అర్థం కావడం లేదు.
– లాల్‌సింగ్,రైతు, దాస్తండా, టేకులపల్లి మండలం
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

