రుద్రంపూర్, అక్టోబర్ 06 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే), భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ (ఐ సి ఏ ఆర్-ఐ ఐ ఓ ఆర్) హైదరాబాద్ సహకారంతో రైతులకు పొద్దుతిరుగుడు హైబ్రిడ్ SUNFH-1 విత్తనాల పంపిణీతో పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం కేవీకే ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కేవీకే సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి డా.టి.భరత్ మాట్లాడుతూ.. పొద్దుతిరుగుడు సాగులో సమతుల్య ఎరువుల యాజమాన్యం, సమగ్ర పంటల యాజమాన్య పద్ధతులు (ఐ సి ఎం) పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. శాస్త్రీయ సాగు పద్ధతులపై రైతులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. వ్యవసాయ సమస్యల పరిష్కారానికి కేవీకే అందిస్తున్న సాంకేతిక సలహాలు, సూచనలు, విస్తరణ సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 60 మంది రైతులకు SUNFH-1 పొద్దుతిరుగుడు హైబ్రిడ్ విత్తనాలను పంపిణీ చేశారు. రైతుల్లో మెరుగైన పొద్దుతిరుగుడు సాగు పద్ధతులపై అవగాహన పెంపొందించడంతో పాటు జిల్లాలో నూనెగింజల ఉత్పత్తిని ప్రోత్సహించడమే కార్యక్రమం ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి రేడియో కేంద్రం ఆడిట్ అధికారి అభిలాష్, ప్రొడక్షన్ అసిస్టెంట్ శ్రీనివాస్‌తో పాటు 50 మంది రైతులు పాల్గొన్నారు.