చండ్రుగొండ, మే 20 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. బుధవారం చండ్రుగొండ గ్రామంలో గల మండల పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల అంతర్గత సమావేశంలో విభేదాలు బయటపడ్డాయి. గ్రామానికి చెందిన చండ్రుగొండ గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్మలపల్లి సురేశ్ తన ఫొటోను ప్లెక్సీలో పెట్టకుండా ఇదే పంచాయతీలో గల మండల పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు నల్లమోతు రమణ ఫొటోతో ఫ్లెక్సీని ఎలా ఏర్పాటు చేస్తారని ఆగ్రహంతో అక్కడ ఉన్న ఫ్లెక్సీని చింపి వేశాడు. ఫ్లెక్సీ పై ఉన్న ఎమ్మెల్యే ఫొటోస్ చింపేయడం జరిగింది. దీంతో ప్రత్యర్థి వర్గానికి చెందిన అంకిరెడ్డి కృష్ణారెడ్డి సురేశ్‌ను తన అనుచరులతో నెట్టించేశాడు.
అక్కడ అర్థగంట సేపు ఒకరినొకరు తిట్టుకుంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒక గ్రామ పంచాయతీలో సర్పంచ్‌ను గెలిపించలేని వ్యక్తిని మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారని సురేష్ అంకిరెడ్డి కృష్ణారెడ్డి ప్రశ్నించాడు. దీంతో అక్కడ ఉన్న కార్యకర్తలు అవాక్కయ్యారు. వలస కాంగ్రెస్ వాదులతో అసలు కాంగ్రెస్ వాదులకు నష్టం జరుగుతుందని సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. చండ్రుగొండ మండలంలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలను అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట దేవి ప్రసన్న గ్రూపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శలు చేశారు.