– రక్త కణాలు దెబ్బతిని అనారోగ్యంపాలు
– వైద్య చికిత్సకై దాతల కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు
బూర్గంపహాడ్, అక్టోబర్ 06 : ఇంటికి ఆసరాగా నిలవాల్సిన వయస్సు. ఆడుతూ పాడుతూ జీవితాన్ని గడపాల్సిన యువకుడు. 19 ఏళ్ల ప్రాయంలో రక్తకణాలు దెబ్బతింటూ వస్తుండడంతో పక్షవాతంతో మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఇంటికి పెద్ద కొడుకు కావడంతో యువకుడి ఆరోగ్య స్థితిని చూసి తల్లిదండ్రులు ఏం చేయలేని దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కొడుకును కాపాడుకోవాలన్న ఆశతో దాతల కోసం ఎదురు చూస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం ఇరవెండి గ్రామానికి చెందిన యువకుడు కొర్సా కార్తీక్ గత ఐదేళ్లుగా రక్తకణాలు దెబ్బతినడంతో ఆరోగ్యస్థితి మందగించి ప్రస్తుతం పక్షవాతంతో మంచానికే పరిమితమయ్యాడు. తల్లిదండ్రులు కొర్సా సర్వేలు, విజయ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తమకున్న దానిలో కొడుకుకు వైద్య చికిత్స చేయిస్తూ ఇప్పటివరకు రూ.2. లక్షలకు పైగానే ఖర్చు చేశారు.

19 ఏళ్ల ప్రాయంలో పక్షవాతంతో మంచానికే పరిమితం
అయితే ఈ వ్యాధి వచ్చిన మొదట్లో రెండు సంవత్సరాల పాటు మందులు సక్రమంగా వాడుతున్నా ఆ మందులకు కొంతమేర బాగున్నప్పటికీ వాటిని జీవితాంతం వాడాల్సిన పరిస్థితి ఎదురైంది. రక్తం విరిగిపోతుండటంతో ఈ సమస్య తలెత్తిందని, రాను రాను ఇప్పుడు కాళ్లు చచ్చుబడి పక్షవాతంగా మారిందని, ఇంటికి ఆదరువుగా ఉండాల్సిన కన్నకొడుకు స్థితి చూసి తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారు. ప్రస్తుతం కొర్సా కార్తీక్ను తల్లిదండ్రులు విజయవాడ ఆస్పత్రికి వైద్యం కోసం తీసుకువెళ్లారు. వైద్య చికిత్సకు డబ్బులు అవసరం కావడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియక నిస్సాహాయంగా దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. తన కొడుకు ప్రాణాలు కాపాడుకోవడానికి సాయం చేయాలని ఆ పేద తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. సహాయం చేయదలచిన దాతలు 9866022051కు ఫోన్ పే చేయాలని చేతులెత్తి మొక్కుతున్నారు.