Karimnagar | ముకరంపుర, ఫిబ్రవరి 15: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని అన్ని శివాలయాలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని కరీంనగర్ సర్కిల్ ఇన్చార్జి ఎస్ఈ వీ గంగాధర్ తెలిపారు. జిల్లాలోని పలు శివాలయాలకు అందుతున్న విద్యుత్ సరఫరాను ఆయన ఆదివారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భక్తులు విద్యుత్ ఇబ్బంది పడకూడదని, అంతరాయం లేకుండా విద్యుత సరఫరా చేసేందుకు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ముందస్తుగా లోడ్ అంచనాకు అనుగుణంగా ట్రాన్స్పార్మర్ల సామర్ధ్యం పెంచామని, విద్యుత్ తీగలకు చెట్ల కొమ్మలు తగలకుండా కొమ్మలను కట్ చేశామని, లైన్లు తగలకుండా స్పేసర్స్ పెట్టామన్నారు. 24 గంటలు పర్యవేక్షణ చేసేలా అదనపు సిబ్బందిని నియమించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ టౌన్ డీఈ రాజం, ఏఈ, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.