Padmashali | సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 28 : టెక్స్ టైల్ అండ్ పవర్ లూం కార్పొరేషన్ చైర్మన్ పదవిని పద్మశాలీలకే కేటాయించాలని పద్మశాలీ యువజన సంఘం పట్టణ అధ్యక్షుడు సబ్బని హరీష్ డిమాండ్ చేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మశాలీ సంఘం భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వస్త్ర పరిశ్రమకు సిరిసిల్ల కేంద్ర బిందువు అని తెలిపారు. పెరిగిన యారన్ ధరలు, పెండింగ్ బిల్లులతో వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిందని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించనున్న టెక్స్టైల్, పవర్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని స్థానిక నేత కార్మికుల సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన స్థానిక పద్మశాలీ వ్యక్తికి ఇస్తేనే న్యాయం జరుగుతుందని అభిప్రాయ వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి చైర్మన్ పదవిని స్థానిక పద్మశాలీ నాయకులు కేటాయించాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో పద్మశాలీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. పవర్లూమ్ కార్మికులు, నేత కార్మికులు, చిన్న పరిశ్రమల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం, వస్త్ర పరిశ్రమకు మార్కెట్ అవకాశాలను పెంచడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో పద్మశాలీ యువజన సంఘం ఉపాధ్యక్షుడు గోరిట్యాల నవీన్, డైరెక్టర్లు ఒగ్గు అరవింద్, మార నరేష్, చిప్ప సర్వేశ్వర, కొండ సాయి తదితరులు పాల్గొన్నారు.