Karimnagar | కమాన్ చౌరస్తా, సెప్టెంబర్ 290: ఆగ్రాలోని పారాట్రూపర్ ట్రైనింగ్ స్కూల్లో నిర్వహించిన పారా బేసిక్ కోర్సులో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించి కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎన్సీసీ క్యాడెట్ జి. సంతోష్ ప్రతిభ కనబరిచాడు. నిజామాబాద్ గ్రూప్, 9(టి) బెటాలియన్ కరీంనగర్ నుంచి ఎంపికైన ఏకైక క్యాడెట్‌గా సంతోష్ నిలిచాడు. కళాశాలలో బీఏ (హెచ్‌పీపీ) ద్వితీయ సంవత్సరం చదువుతున్న సంతోష్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డైరెక్టరేట్ తరఫున ఆగ్రాలోని ఏఏటీఎస్, పీటీఎస్‌లో 12 రోజుల పాటు నిర్వహించిన శిక్షణలో పాల్గొన్నాడు.
శిక్షణలో భాగంగా ఆగ్రా కోట, ఏడీఆర్డీఈ (డీఆర్డీఓ), తాజ్‌మహల్, ఎన్సీసీ ఎయిర్‌వింగ్ హ్యాంగర్లను సందర్శించాడు. సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు మూడు పారా జంప్‌లను విజయవంతంగా పూర్తి చేశాడు. సెప్టెంబర్ 24న ఏడీజీ మేజర్ జనరల్ గౌరవ్ గౌతమ్ సమక్షంలో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. సంతోష్‌ను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. రామకృష్ణ, ఎన్సీసీ అధికారి కెప్టెన్ రేల్ల సంజీవ్, అధ్యాపకులు అభినందించారు.