Ghanmukla | వీణవంక , జూన్ 26 : వీణవంక మండలంలోని ఘన్ముక్ల గ్రామంలోని శ్రీ భవాని శంకర స్వామి దేవాలయంలో 22వ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారికి శుక్రవారం కళ్యాణ మహోత్సవం, అన్నదానం, గ్రామం పురవీధుల గుండా శివపార్వతుల రథోత్సవం వైభవంగా సాగింది. ఆలయ చైర్మన్ జిన్నారపు శివకుమార్ ఆధ్వర్యంలో శ్రీ భవాని శంకర స్వామి ఆలయంలో ఉదయం 6 గంటలకు అఖండ దీపారాధన, గణపతి గౌరీ పూజ, స్వస్తి పూజ పుణ్య హవచనం, ధ్వజారోహణ, ఉదయం ఏడున్నర గంటలకు రుద్రభిషేకం, ఉదయం 9 గంటలకు రుద్ర హోమం, పూర్ణాహుతి, ఉదయం 11 గంటలకు శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం గ్రామ పురవీధుల గుండా ఉత్సవ మూర్తుల ఊరేగింపు ఘనంగా జరిగింది. ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులు రాకతో ఆలయం రద్దీగా మారింది. స్వామివారిని రకరకాల పుష్పాలతో ఘనంగా అలంకరించారు. నవగ్రహాల ఆరాధన, ధ్యానం, హోమాది జపాది కార్యక్రమాలను వేద బ్రాహ్మణ సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం సమయాన ఉత్సవ మూర్తులైన శివపార్వతులను గ్రామ పూర్వ వీధుల గుండా మహిళా భక్తుల కోలాట ముత్యాల నడుమ ఊరేగిస్తూ, భక్తులు కొబ్బరికాయలు కొడుతూ మొ క్కులు చెల్లించుకుని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమాల్లో శ్రీ భవాని శంకర స్వామి ఆలయ చైర్మన్ జిన్నారపు శివకుమార్, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళా భక్తులు, గ్రామ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.