Single Registration | గోదావరిఖని : ఒకే డాక్యుమెంటు రిజిస్ట్రేషన్ తో రిజిస్ట్రేషన్ శాఖకు రూ.కోటి రెండు లక్షల 87 వేల 200 ఆదాయం సమకూరింది. రామగుండం సబ్ రిజిస్టార్ కార్యాలయంలో సోమవారం గోదావరిఖనిలో ఏర్పాటు చేయనున్న భారీ షాపింగ్ మాల్ డిమార్ట్ కు సంబంధించి 56 గుంటల స్థలం రిజిస్ట్రేషన్ చేశారు. దీనికి సంబంధించి రూ.కోటికి పైగా ఆదాయం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి లభించింది.
గత కొద్ది రోజుల క్రితమే షాపింగ్ మాల్ నిర్మాణ అనుమతుల కోసం రామగుండం కార్పొరేషన్ కార్యాలయానికి రూ.48 లక్షల చెల్లించి భవన నిర్మాణ అనుమతులు పొందారు. గోదావరిఖని పట్టణంలో భారీ షాపింగ్ మాల్ నిర్మించడానికి స్థలాన్ని కొనుగోలు చేసినప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా వివాదం నెలకొని ఇబ్బందులెదరయ్యాయి. వాటన్నిటినీ అధిగమించి సోమవారం గోదావరిఖని పట్టణంలోని మాతంగి కాలనీ అలేఖ్య థియేటర్ కు చెందిన 56 గుంటల స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. గత కొంతకాలం క్రితమే రామగుండంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం పనులు ప్రారంభమయ్యాయి.
కొద్ది రోజుల క్రితం కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ కి సంబంధించి భారీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడం అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా రూ.5 కోట్లకు పైగా ఆదాయం లభించిందని ఆ తర్వాత సోమవారం కోటికి పైగా ఆదాయం రావడం సంతోషంగా ఉందని సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారులు పేర్కొంటున్నారు.