కార్పొరేషన్, ఫిబ్రవరి 8 : ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నేటి నుంచి రెండు రోజులపాటు కరీంనగర్లో ప్రాపర్టీ షో నిర్వహించనున్నారు. కలెక్టరేట్ ఎదుట ఉన్న రెవెన్యూ గార్డెన్స్ వేదికగా శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ ఎక్స్పోను ప్రారంభించనున్నారు. శుక్ర, శనివారాల్లో ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు నిర్వహించనున్నారు.
హైదరాబాద్, కరీంనగర్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ రంగ సంస్థలు, బ్యాంకులకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అందులో వెంచర్లు, అపార్ట్మెంట్లు, రెడీమెడ్ ఇండ్లు, విల్లాలు, కల్పిస్తున్న సౌకర్యాలు, ఇండ్ల నిర్మాణాలకు అయ్యే వ్యయం, బాంకు రుణాలు ఇలా అన్ని వివరాలను ప్రతినిధులు అందించనున్నారు. నిర్మాణ రంగానికి సంబంధించిన పూర్తి సమాచారం ఒకే వేదికగా తెలుసుకునే అవకాశం ఈ ప్రాపర్టీ షో కల్పిస్తుండగా, సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించారు.