మెట్పల్లి, జనవరి 1 : ఉద్యోగ విరమణ పొందినా 67 ఏండ్ల వయస్సులోనూ విశ్రాంతి తీసుకోకుండా శిక్షణ ఇస్తున్నాడు. క్రీడల్లో తనకున్న అపార అనుభవాన్ని రంగరించి నిరుద్యోగుల సేవలో తరిస్తున్నాడు. విద్యార్థులు, పోలీసు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఉచితంగా శిక్షణనిస్తూ మెళకువలు నేర్పుతూ పోటీలకు సిద్ధంచేస్తున్నాడు. కబడ్డీ, ఖోఖో, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్‌పుట్ లాంటి అన్ని క్రీడల్లో ట్రైనింగ్ ఇస్తూ ఆల్‌రౌండర్‌గా కీర్తిగడించాడు. వందలా మంది అభ్యర్థులకు తర్ఫీదునిస్తూ భవితకు బాటలు వేస్తున్న మెట్‌పల్లికి చెందిన విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్ గంగాధర్‌పై ప్రత్యేక కథనం..
క్రీడల్లో తనకున్న అనుభవం, నైపుణ్యాన్ని రంగరించి పోలీసు ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న అనేక మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణనిస్తూ ప్రశంసలందుకుంటున్నాడు. 67 ఏండ్ల వయస్సులోనూ విశ్రాంతి తీసుకోకుండా క్రీడాకారులకు ట్రైనింగ్ ఇస్తున్నాడు మెట్‌పల్లికి చెందిన అట్టిమల్ల గంగాధర్. 1979-80లో పీఈటీగా ఉద్యోగంలో చేరిన ఆయన 2013లో కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా రిటైర్డ్ అయ్యారు. విధి నిర్వహణలో అనేక ప్రశంసలు, పురస్కారాలు అందుకున్నారు. రాష్ట్రస్థాయి ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడిగా గుర్తింపు దక్కించుకున్నారు. విభిన్నమైనక్రీడల్లో ప్రావీణ్యం కలిగిన అట్టిమల్ల గంగాధర్ కాలక్రమేణా ఇంటి పేరు ఆల్ రౌండర్ గంగాధర్‌గా మారింది. తనకున్న క్రీడానైపుణ్యంతో పోలీస్, ఆర్మీ, ఎక్సైజ్, అటవీశాఖ, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ వంటి అనేక శాఖల్లో ఉద్యోగాల కోసం పోటీ పడే అభ్యర్థులకు మెళకువలు నేర్పిస్తూ తీర్చిదిద్దుతున్నాడు. ఇప్పటికే తన వద్ద శిక్షణ పొందిన వారిలో కనీసం 270 మందికి పైగా ఎస్ఐ, కానిస్టేబుల్, పీఈటీ, సైనికులుగా, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ జవాన్లుగా ఉద్యోగాలు పొందడం విశేషం.
రాష్ట్ర ప్రభుత్వం 2017లో పోలీస్ శాఖ పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో మెట్పల్లి అంబేద్కర్ మినీ స్టేడియంలో స్థానిక అప్పటి డీఎస్పీ మల్లారెడ్డి అందించిన ప్రోత్సాహంతో 300 మంది యువతకు శిక్షణ ఇచ్చారు. ఈవెంట్స్‌కు సంబంధించి మెళకువలను నేర్పారు. అప్పుడు శిక్షణ పొందిన యువతలో 20 మంది పోలీస్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రస్తుతం మరో సారి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీస్ ఉద్యోగాల భర్తీ చేపడుతున్న నేపథ్యంలో యువత భవితకు భరోసాగా తన వంతుగా సహకారం అందిస్తున్నారు. ఈవెంట్స్‌లో సులువుగా రాణించేందుకు మెళకువలను నేర్పించే ప్రక్రియను గత రెండు నెలలుగా చేపట్టారు. స్థానిక అంబేద్కర్ మినీ స్డేడియంలో ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7.30 గంటల వరకు శిక్షణ ఇస్తున్నారు. కాగా ఇటీవల జరిగిన ఈవెంట్స్‌లో 30 మంది పురుషులు 10 మంది మహిళలు ఎంపికయ్యారు.
ఈవెంట్స్‌లో మెళకువలు
పోలీస్ సబ్ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఈవెంట్స్ అయిన రన్నింగ్, లాంగ్ జంప్, షార్ట్ఫుట్కు సంబంధించి ప్రత్యేకంగా కోచింగ్ ఇస్తున్నారు. కిందటి సారి పోలీస్ ఉద్యోగాలకు ఐదు ఈవెంట్స్ ఉండగా మూడు ఈవెంట్స్‌లలో రాణించాలి. కానీ ఈ సారి ఐదు నుంచి మూడింటికి కుదించారు. ప్రస్తుతం మూడింటికి మూడు ఈవెంట్స్‌లో రాణిస్తేనే అర్హత సాధిస్తారు. కచ్చితంగా ఈవెంట్స్ కీలకం కావడంతో పోటీపడుతున్న అభ్యర్థులకు తనదైన శైలిలో మెళకువలు నేర్పిస్తూ ఉదయం, సాయంత్రం కోచింగ్ ఇస్తున్నారు.
సేవా భావంతో శిక్షణ ఇస్తున్న..
పోలీస్, ఎక్సైజ్, అటవీశాఖలతో పాటు సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఆర్మీ తదితర ఉద్యోగాలకు సిద్ధమవుతున్న గ్రామీణ యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్న. చాలా మంది నన్ను షటిల్ కోర్టు వేసేందుకు లేదా టోర్నమెంట్ నిర్వహణకు ఆహ్వానిస్తారు. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడల అభివృద్ధికి సహకరిస్తా. ఒంట్లో శక్తి ఉన్నంత వరకు ఉచితంగా శిక్షణ ఇస్తా. ప్రస్తుతం పోలీస్ ఉద్యోగ శిక్షణ కోసం మెట్పల్లి పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుంచి రోజూ 140 మంది వస్తున్నారు. రన్నింగ్, షార్ట్ఫుట్, లాంగ్ జంప్‌కు సంబంధించి రెండు నెలలుగా ఉచితంగా కోచింగ్ ఇస్తున్న. కఠోర సాధన చేయిస్తున్నా. నా వద్ద శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థుల్లో ఎవరైనా సబ్ఇన్స్పెక్టర్గా ఉద్యోగం సాధిస్తే బంగారం బహుమతి ఇస్తానని కూడా ప్రకటించిన.
– ఆల్ రౌండర్ గంగాధర్, విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్, మెట్పల్లి
ఈవెంట్స్‌లో అర్హత సాధించిన
ఎంతో అపార అనుభవం కలిగిన విశ్రాంత ఫిజికల్ డైరెక్టర్ వద్ద కోచింగ్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈవెంట్స్‌కు సంబంధించి రన్నింగ్, లాంగ్ జంప్, షాట్ ఫుట్‌లో రాణించేందుకు మెళకువలు నేర్పుతున్నారు. ఈ కారణంగానే నేను ఇటీవలి ఈవెంట్స్‌లో అర్హత సాధించా. మెయిన్స్‌లో ప్రతిభ చూపి కచ్చితంగా ఉద్యోగం సాధిస్తానన్న నమ్మకం ఉన్నది.
– పూజిత, కానిస్టేబుల్ అభ్యర్థి, మెట్పల్లి
శిక్షణతో భరోసా..
పోలీస్ ఉద్యోగాల కోసం పోటీపడుతున్న నా వంటి ఎందరికో ఈ ఉచిత శిక్షణ భరోసా కల్పిస్తున్నది. ఒక్క పైసా ఆశించకుండా మేము పోలీస్ ఉద్యోగాలనే సాధించాలనే సేవా భావంతో రెండు నెలలుగా ఈ వెంట్స్‌పై శిక్షణ ఇస్తున్నారు. ఎందు కంటే డబ్బులు ఇచ్చినా శిక్షణ ఇచ్చేవారు దొరకరు. ఆయన ఇచ్చిన మెళకువలతోనే ఇటీవల జరిగిన ఈవెంట్స్‌లో అర్హత సాధించా. ఉద్యోగ విరమణ పొందినప్పటికీ 67 ఏండ్ల వయస్సులోనూ మాకు అలుపెరగకుండా ఉదయం, సాయంత్రం కోచింగ్ ఇస్తున్న ఆల్‌రౌండర్ గంగాధర్ సార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు.
– సాయితేజ, కానిస్టేబుల్ అభ్యర్థి, మెట్పల్లి