పెద్దపల్లి, ఫిబ్రవరి 25( నమస్తే తెలంగాణ): అందరి సహకారంతో పెద్దపల్లి పట్టణాన్ని మరింత అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తామని మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే విజయ రమణారావు సమక్షంలో చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించారు. ఎమ్మెల్యే విజయరమణరావు నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. చైర్మన్, పాలకవర్గం కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధికి కృషి చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి అందుబాటులోఉండాలని సూచించారు.
ఈ సందర్భంగా మల్లయ్య మాట్లాడుతూ..ఎమ్మెల్యే సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి ఇంటికి శుభ్రమైన తాగునీరు, మంచి డ్రైనేజీ వ్యవస్థ, పక్కాగా తడి, పొడి చెత్త అమలు, రోడ్లు, వీధుల దీపాలు, పార్కుల అభివృద్ధి, మెరుగైన ఆరోగ్యం, విద్యా సౌకర్యాలు, యువతకు ఉపాధి అవకాశాలు, స్వచ్ఛతకు పెద్దపీట వేస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, తదితరులు పాల్గొన్నారు.