సుల్తానాబాద్ రూరల్ అక్టోబర్ 08: గ్రామానికి కీడు సోకిందని ఊరు విడిచి వివిధ ప్రాంతాలకు వనభోజనాలకు తరలి వెళ్లారు. ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయి, సాయంత్రం 6 గంటలకు తిరిగి వస్తారు. ఊరు మొత్తం ఖాళీ కావడంతో గ్రామం నిశ్శబ్దంగా మారింది. విషయం తెలుసుకున్న సుల్తానాబాద్ ఎస్సై చంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కనుకుల గ్రామంలో రెండు, మూడు నెలల నుంచి దాదాపుగా 13 మంది వరకు వివిధ కారణాలతో మృత్యువాత పడ్డారు. దీంతో గ్రామస్తులో భయం నెలకొంది. గ్రామస్తులందరూ కలిసి సమావేశమయ్యారు.
ఒకరోజు ఊరు విడిచి వనభోజనాలకు వెళ్లాలని అందరు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా గురువారం తెల్లవారుజాము 6 గంటలకు ఇంటి నుంచి నీరుకుల మానేటి రంగనాయక స్వామి ఆలయ ఆవరణకు కొంతమంది, ఓదెల మండలం, బిజిగిరి కి కొంతమంది, ధర్మపురి, సమీప గ్రామాలకు కొంతమంది, ఇలా వివిధ ప్రాంతాలకు గ్రామ సర్పంచ్ తో పాటు గ్రామస్తులందరూ పిల్లాపాపలు, వృద్ధులు, అందరూ ఇంటి కి తాళం వేసి ఇంటి నుంచి వెళ్లిపోయారు.. తిరిగి ఇదే రోజు సాయంత్రం 6 గంటలకు ఇంటికి చేరుకున్నారు. ఇలా చేస్తేనే ఎవరు చనిపోకుండా ఉంటారని ఆ గ్రామస్తుల నమ్మకం.