చివరి ఆయకట్టుకు నీరందేనా..?
ఎట్టకేలకు యాసంగి సాగుకు నీరివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అల్గునూర్ నుంచి సూర్యాపేట వరకు ఉన్న సుమారు 8.09 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని నిర్ణయించింది. ఈమేరకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఎల్ఎండీ జలాశయం నుంచి దిగువ ఆయకట్టుకు మంత్రి పొన్నం ప్రభాకర్ నీటిని విడుదల చేస్తున్నారు.
- మధ్య, దిగువ మానేరులో 42 టీఎంసీలు
- 27 టీఎంసీలే వాడుకునే అవకాశం
- నేడు రెగ్యులేటర్ వద్ద నీటిని విడుదల చేయనున్న మంత్రి పొన్నం ప్రభాకర్
- ఆన్-ఆఫ్ పద్ధతిలో ప్రతి రోజు 4 వేల క్యూసెక్కులే రిలీజ్
- దిగువన 8.09 లక్షల ఆయకట్టు
- టేలెండ్కు అందడం కష్టమే అంటున్న రైతులు
- ఆరుతడి పంటలే వేసుకోవాలని అధికారుల సూచన
ఎట్టకేలకు యాసంగి సాగుకు నీరివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అల్గునూర్ నుంచి సూర్యాపేట వరకు ఉన్న సుమారు 8.09 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని నిర్ణయించింది. ఈమేరకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఎల్ఎండీ జలాశయం నుంచి దిగువ ఆయకట్టుకు మంత్రి పొన్నం ప్రభాకర్ నీటిని విడుదల చేస్తున్నారు. మధ్యమానేరు, దిగువ మానేరు జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకుని ఆన్-ఆఫ్ పద్ధతిలో ప్రతి రోజూ 4వేల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తుండగా, ఈ సారి చివరి ఆయకట్టుకు నీరందడం కష్టమేనని రైతులు వాపోతున్నారు.
కరీంనగర్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : యాసంగి సాగుకు నీరివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల ఎల్ఎండీ కాలనీలో జరిగిన సమావేశంలో ప్రాజెక్టు ఉన్నతాధికారులు వచ్చే నెల ఒకటి నుంచి నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ఒకరోజు ముందే రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం సాయంత్రం 4 గంటలకు దిగువ ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. నీటి విడుదలకు సంబంధించి సందేహాలు ఉండగా, నీటి పారుదల శాఖ అధికారులు ఒక షెడ్యూల్ నిర్ణయించుకున్నారు.
ఆన్-ఆఫ్ పద్ధతిలో ఏడు రోజులపాటు దిగువ కాకతీయ కాలువ 146వ కిలోమీటరు నుంచి 284వ కిలో మీటరు వరకు, 8 రోజులపాటు 284 కిలో మీటరు కింద ఉన్న ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దిగువ ఆయకట్టుకు మధ్యమానేరు, దిగువ మానేరు జలాశయాల్లో ఉన్న నీటిని మాత్రమే వాడుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం మధ్యమానేరులో 23 టీఎంసీలు, దిగువ మానేరులో 19.6 టీఎంసీల చొప్పున 42 టీఎంసీల వరకు అందుబాటులో ఉన్నది. అయితే అందు లో కేవలం 27 టీఎంసీల నీటిని మాత్రమే వాడుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. అధికారులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. కరీంనగర్ జిల్లా అల్గునూర్ నుంచి సూర్యాపేట జిల్లా వరకు ఉన్న దిగువ కాకతీయ కాలువ పరిధిలో 8.09 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ మొత్తానికి ప్రతి రోజు 4 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు.
చివరి ఆయకట్టుకు కష్టమే
నీటి విడుదలకు అధికారుల ప్రస్తుత ప్రణాళికను చూస్తే చివరి ఆయకట్టుకు నీరందడం కష్టమనే చెప్పవచ్చు. గత యాసంగి, వానకాలం పంటలకు అప్పటి ప్రభుత్వం ప్రతి రోజు 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది. దీంతో చివరి ఆయకట్టుకూ నీరందింది. ఇప్పుడు కేవలం 4 వేల క్యూసెక్కులే ఇస్తున్న నేపథ్యంలో మొదటి ఆయకట్టు రైతులకు కూడా నీరు సరిపోయే పరిస్థితి కనిపించడం లేదు. కరీంనగర్ జిల్లా పరిధిలో గత రెండు పంటలకు అందిన నీటిని పరిశీలిస్తే హుజూరాబాద్ నియోజకవర్గంలో వానకాలం 4.55 టీఎంసీల నీటిని 88,558 ఎకరాలకు అందించారు.
యాసంగిలో 5.30 టీఎంసీల నీటిని 78,716 ఎకరాలకు అందించారు. దీంతో చివరి ప్రాంతంలో ఉన్న జమ్మికుంట మండలం నాగారం, బిజిగిరి షరీఫ్ వంటి గ్రామాలకు కూడా పూర్తి స్థాయిలో నీరందింది. అదే మానకొండూర్ నియోజకవర్గంలో చూస్తే డీబీఎం 2 నుంచి డీబీఎం 14 వరకు 38,662 ఎకరాలకు రెండు పంటలకు నీరందించగలిగారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. గతంలో డిసెంబర్ 28 నుంచి ప్రతి రోజు 6 వేల క్యూసెక్కుల చొప్పున ఏప్రిల్ 14 వరకు నీటిని అందించారు. ఈ సారి డిసెంబర్ 31 నుంచి మార్చి 30 వరకు రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది. గతేడాది యాసంగిలో 8 తడులు అందించిన అధికారులు ఈ సారి 6 తడులకే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తున్నది.
ఆరుతడికే ప్రాధాన్యం
ప్రాజెక్టులో నీటి లభ్యతను బట్టి రైతులు సహకరించాలని అధికారులు కోరుతున్నారు. విడుదల చేసే నీటిని ఆరుతడి పంటలకే వాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటి లభ్యత తక్కువగా ఉన్నదని, దీనికి తామేమీ చేయలేమని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు ఎంత మేరకు సహకరిస్తారనే సందేహం వ్యక్తమవుతున్నది. ఆయకట్టు పరిధిలో ఇప్పటికే నారు పోసుకున్న రైతులు ప్రాజెక్టు నీటి కోసం ఎదురు చూస్తున్నారు. అల్గునూర్ నుంచి సూర్యపేట వరకు నీరందిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ, అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇచ్చే 4 వేల క్యూసెక్కులు కాలువ మొదట్లో ఉన్న రైతులకే సరిపోవని, చివరి ఆయకట్టుకు ఎలా చేరుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయకట్టు పరిధిలో ఈ సారి సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి
ఎల్ఎండీ దిగువ ఆయకట్టుకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ నీటిని విడుదల చేస్తా రు. మొదటి ఏడు రోజులు దిగువ కాకతీయ కాలువ 146 కిలోమీటరు నుంచి 284వ కిలోమీటరు వరకు అందిస్తాం. ఆ తర్వాత 8 రోజులు 284వ కిలోమీటర్ దిగువ ఆయకట్టుకు నీరిస్తాం. మధ్య, దిగువ మానేరు జలాశయాల్లో నీటి లభ్యత తక్కువగా ఉన్నది. స్టేజ్-1,2 పరిధిలో యాసంగి పంటలకు నీరు సరిపోయే పరిస్థితి లేదు. ప్రతి డిస్ట్రిబ్యూటరీకి సంబంధించి చివరి ఆయకట్టుకు సమృద్ధిగా నీరు అందే పరిస్థితి లేదు. ఆయకట్టు రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలి. నీటి పారుదల శాఖకు సహకరించాలి.
– పీ శివకుమార్, ఎస్ఈ (ఇరిగేషన్ సర్కిల్-2)
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

